ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు పన్నుల రూపంలో ఇస్తున్న నిధులను తిరిగి ప్రజలకు పథకాల రూపంలో ఇస్తోంది. వీలైనంతవరకూ అవినీతి జరగకుండా ఉండేందుకు లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు చేరేలా చేస్తోంది. ఐతే... ఇప్పటికీ చాలా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచీ లబ్దిదారులకు డబ్బులు చేరట్లేదు. ఉదాహరణకు తిరుపతిలోని వరదయ్యపాలెం SBI బ్యాంకునే తీసుకుంటే... అక్కడ డ్వాక్రా మహిళలు, రైతులు ఉదయం నుంచీ పడిగాపులు పడ్డారు. అయినా ఇంకా చాలా మందికి డబ్బులు చేరలేదు. మండుటెండల్లో కనీసం మంచి నీళ్లు కూడా తాగకుండా డబ్బుల కోసం ఎదురుచూస్తే... తమకు తీవ్ర నిరాశే కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు.
4, 5 విడత రుణ మాఫీ కోసం రైతులు, పసుపు-కుంకుమ పథకం మూడో చెక్ నగదు రూ.4,000 కోసం మహిళలు ఉదయం నుంచీ బ్యాంకుల దగ్గర ఎదురు చూసీ చూసీ... టైం అయిపోయినా... నిధులు రాక తీవ్ర నిరాశ చెందారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయకుండా తమ సహనంతో బ్యాంక్ సిబ్బంది ఆడుకుంటున్నారని వాళ్లు అసహనం వ్యక్తం చేశారు. నిధుల కోసం మళ్లీ బుధవారం బ్యాంకుకు రావాలని అధికారులు చెబుతుండటంతో ఏం చెయ్యాలో అర్థంకాక సతమతమవుతున్నారు లబ్దిదారులు.
ఇక్కడే కాదు... చాలా జిల్లాల్లో ఈ సమస్య ఎదురవుతోంది. క్షణాల్లో మనీ ట్రాన్స్‌ఫర్ చెయ్యాల్సిన బ్యాంకుల అధికారులు... తమ అలసత్వంతో ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బును సకాలంలో అకౌంట్లలో క్రెడిట్ చెయ్యకుండా ఇబ్బందులు పెడుతున్న సందర్భాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.