Home /News /andhra-pradesh /

Andhra Pradesh: వింత వ్యాధితో రైతు మృతి.. పశ్చిమ గోదావరిలో అసలేం జరుగుతోంది..?

Andhra Pradesh: వింత వ్యాధితో రైతు మృతి.. పశ్చిమ గోదావరిలో అసలేం జరుగుతోంది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొమిరేపల్లి గ్రామానికి చెందిన రైతు ఏసుపాదం (65) పశువుల మేత కోసం పొలానికి వెళ్లాడు. ఉన్నపళంగా తీవ్ర అస్వస్థతకు గురై పంట కాలువలో పడి మరణించాడు.

    ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం కొనసాగుతోంది. అంతుచిక్కని వ్యాధితో తాజాగా ఓ రైతు మరణించడం సంచలనం రేపుతోంది. ఇటీవల పలువురు అస్వస్థతకు గురైన దెందులూరు మండలం కొమిరేపల్లి గ్రామంలోనే ఈ ఘటన జరగడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కొమిరేపల్లి గ్రామానికి చెందిన రైతు ఏసుపాదం (65) పశువుల మేత కోసం పొలానికి వెళ్లాడు. ఉన్నపళంగా అతడు తీవ్ర అస్వస్థతకు గురై పంట కాలువలో పడి మరణించాడు. అటుగా వెళ్తున్న ఓ స్థానికులు రైతు మృతి విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గ్రామంలో ఇప్పటికే వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యులు రైతు మృతదేహాన్ని పరీక్షించారు. అతడు ఎలా చనిపోయాడన్నది అంతుచిక్కడం లేదు. ఏసుపాదం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    కొమిరేపల్లి గ్రామంలో జనవరి 21న నుంచి వింత వ్యాధిలో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. గురువారం ఓ వ్యక్తి కళ్లు తిరిగిపడిపోయాడు. శుక్రవారం 24 మంది, శనివారం మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మొత్తం బాధితుల సంఖ్య 29కి చేరింది. వీరిలో పలువురు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురిని ఏలూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కళ్లు తిరగటం, స్పృహ కోల్పోవడం, నీరసంతో చతికిలపడటం, నోటి నుంచి నురగ రావడం వంటి లక్షణాలు కనిపించాయి. ఐతే ఆదివారం ఏకంగా ఓ వ్యక్తి మరణించడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.

    ఇక ఏలూరులో గత ఏడాది డిసెంబరు 4 నుంచి వింత వ్యాధి కలవరం మొదలయింది. దాదాపు 2 వారాల పాటు కేసులు నమోదవడంతో.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఏలూరులో మొత్తం 600 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఐతే అక్కడ క్రమ క్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఐతే అంతలోనే శుక్రవారం మరోసారి వింత వ్యాధి కలకలం రేగింది. మరో ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రి పాలయ్యారు. అంతేకాదు నాలుగు రోజుల క్రితం భీమడోలు మండలం వూళ్ల, తాజాగా దెందలూరు మండలం కొమిరేపల్లిలోనూ వింత వ్యాధి కేసులు నమోదవడం మళ్లీ సంచలనం సృష్టిస్తోంది. ఏలూరు కేసులకు పురుగుల మందుల అవశేషాలే కారణమని నిపుణులు తేల్చగా.. తాజా కేసులపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

    ఐతే ఈ వింత వ్యాధి విజృంభణపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వింత వ్యాధి వెనుక కుట్రకోణం దాగి ఉందన్న ఆయన..జనసేన, తెలుగుదేశం పార్టీలపైనే ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బాధితులను ఆస్పత్రికి తరలించే అంబులెన్సులను జనసేన నేతలు అడ్డుకుంటున్నారంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరముందన్నని ఆళ్లనాని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడొద్దని ఆయన హెచ్చరించారు. బాధితుల పట్ల జనసేన నేతలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆళ్లనాని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పాలనకు చెడ్డపేరు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆళ్లనాని ఆరోపించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Eluru, West Godavari

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు