తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొంతమంది అక్రమార్కులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. వాస్తవానికి శ్రీవారిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండలేక.. కొంతమంది సులభంగా దర్శించుకునేందుకు ఇతర మార్గాలను వెతుకుతుంటారు. అందులో భాగంగానే అభిషేకం, సుప్రభాతం సేవల టికెట్కను దక్కించుకోవడానికి ఆరాటపడుతుంటారు. అయితే ఇలాంటి వారిని నమ్మించి అక్రమార్కులు నకిలీ టికెట్లను భక్తులకు అంటగడుతుంటారు. ఆ కోవలోకే చెందిన ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది.
చెన్నైకి చెందిన భక్తుడు రవినారాయణన్ శ్రీవారి దర్శనం కోసం టికెట్లు ఇప్పించాలని తన బంధువు భరత్‌ను కోరాడు. అయితే భరత్ తనకు తెలిసిన లక్తిక్, రాహుల్‌ను పరిచయం చేసి, వారు టికెట్లు ఏర్పాటు చేస్తారని తెలిపాడు. రవినారాయణన్ తన కుటుంబ సభ్యుల కోసం 10 సుప్రభాతం, 18 అభిషేకం టికెట్లను కొనుగోలు చేయగా, అందుకు లక్తిక్, రాహుల్‌కు రూ.73వేలు ఆన్లైన్లో చెల్లించాడు. వారు ఆన్లైన్లో టికెట్లను పంపించారు. ఆ టికెట్లను తీసుకుని గత డిసెంబర్ 13వ తేదీన రవినారాయణన్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చారు. అయితే ఆ టికెట్లు నకిలీవని తేలడంతో రవినారాయణన్ సోమవారం టీటీడీ విజిలెన్స్ అధికారులను సంప్రదించి జరిగిన విషయం చెప్పారు. దీంతో విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Published by:Vijay Bhaskar Harijana
First published:February 11, 2020, 10:21 IST