news18-telugu
Updated: October 14, 2020, 6:08 PM IST
తుని రైల్వే బ్రిడ్జిపైకి నీరు( ఫైల్ ఫోటో)
తెలుగు రాష్ట్రాలను వర్షాలు, వరదలు ముంచెత్తున్నాయి. హైదరాబాద్లో వర్షాల కారణంగా వరదలు.. ఇతర జిల్లాల్లో చెరువులు, నదులు పొంగడం ద్వారా వరదలు ప్రజలను భయపెడుతున్నాయి. వర్షాలు, వరదలు ఇలా ఉంటే.. సోషల్ మీడియాలో కొందరు పెట్టే పోస్టులు కూడా ప్రజలను మరింతగా భయపెడుతున్నాయి. కొందరు వరదలు సృష్టిస్తున్న బీభత్సం నుంచి ఇతరులను అలర్ట్ చేసేందుకు ఈ రకమైన వీడియోలను పోస్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ప్రజలను మరింతగా భయపెట్టేందుకు పాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో వర్షాలు, వరదల విషయంలో ఏది నిజమో ? ఏది ఫేక్ వీడియోనో అర్థంకాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.
ఏపీలోని తుని తాండవ రైల్వే బ్రిడ్జిపై వరద ప్రవాహం చేరుకుందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రైల్వే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. దీనిపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. తుని వద్ద తాండవ రైల్వే బ్రిడ్జిపై వరద ప్రవాహం పాత వీడియో అని క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో పాత వీడియో పెట్టి కొందరు వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొంది.
ప్రజలు, ప్రయాణికులు ఎవరూ ఇలాంటి వదంతులు నమ్మవద్దని సూచించింది. తుని తాండవ రైల్వే బ్రిడ్జి మునిగిపోలేదని.. సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. ఇది మాత్రమే కాదు.. జీహెచ్ఎంసీ వర్షపు నీరులో మొసలి కొట్టుకువచ్చిందంటూ ఓ వీడియో కూడా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో నిజంగానే హైదరాబాద్ నగరానికి సంబంధించిందా లేక ఇది కూడా పాత వీడియోనా అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
Published by:
Kishore Akkaladevi
First published:
October 14, 2020, 6:08 PM IST