P Anand Mohan, News18, Visakhapatnam
అసలే ఎండాకాలం. అందులోనూ ఫ్యాన్లు తిరిగినా గాలి సరిపోదు. దీంతో జనం ఏసీలవైపు పరుగులు తీస్తున్నారు. కానీ.. ఇదే అదనుగా సర్కారు వారు చక్కగా పిండే కార్యక్రమం మొదలుపెట్టారు. ఏసీలు వాడితే బిల్లులు ఆటోమెటిక్ గా గట్టిగా వస్తాయి. అయితే కొత్త ఏసీలు కొని బిగించుకుంటే చాలు నాలుగువేల రూపాయలు కట్టాలంటూ నోటీసులు వస్తున్నాయి. ఇది అన్ని ప్రాంతాల్లోనూ వస్తున్న వింత అనుభవం. ఈ విధంగా అదనపు వాడకం పేరుతో పిండేస్తున్నారని జనం లబోదిబోమంటున్నారు. పంచభూతాలతో పాటు ఆరో భూతంలా మారిపోయింది విద్యుత్తు. ఇది అత్యవసరం. ఏది లేకపోయినా ఫర్లేదు.. విద్యుత్తు లేకపోతే లబోదిబోమంటారు జనం. పేద బిక్కి జనంతో పోలిస్తే.. ఇక మధ్యతరగతికి ఏసీ అనివార్య అవసరం అయిపోయింది. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు ఉక్కపోతతో సతమతమవుతుండడంతో అప్పో సప్పో చేసి, నెలసరి వాయిదాల మీద అయినా ఏసీలు కొనుగోలు చేస్తున్నారు.
విశాఖపట్నం వియానికి వస్తే నగరంలో ఏసీలు విక్రయించే షాపులు చాలానే ఉన్నాయి. ఒక్క షాపింగ్ మాల్ లోనే గత నెలలో 900 ఏసీలు, ఈ నెలలో 700 ఏసీలు అమ్ముడయ్యాయి. అంటే ఈ లెక్కన ఎంతవుతుందో అర్ధం చేసుకోవాల్సిందే. సగటున ఏసీ ధరలు రూ. 30 వేల నుంచీ రూ. 80 వేల దాకా వుంటున్నాయి. ప్రారంభ ధరే తీసుకున్నా ఏసీ కొనుగోలు కోసం వినియోగదారుడు కనీసమంటే రూ.30 వేలు ఖర్చు చేయాల్సివస్తోంది.
ఏసీ ఉన్నాక నెలవారీ కరెంటు బిల్లులు పెరుగుతాయి. అయిదు వందలు దాటని బిల్లులు చెల్లించేవారు కూడా నెలకు రూ. వెయ్యి నుంచీ రూ. 2 వేలు చెల్లించక తప్పదు. వేసవిలో మూడు నెలల పాటు తప్పనిసరై ఈ అదనపు భారాన్ని భరించేందుకు సిద్ధపడుతున్నారు. ఏదో ఇదేదో భరిద్దామనుకుంటే విద్యుత్ శాఖ కొత్త రకం బాదుడుతో వినియోగదారుల్ని పిండేస్తోంది. విశాఖతో పాటు.. అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లోనూ అటు ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
సాధారణంగా విద్యుత్ సర్వీసు కనెక్షన్ తీసుకునే సమయంలో వినియోగదారులు తమ ఇంటికి అవసరమైన సామర్ధ్యానికి డిపాజిట్ చెల్లించి కనెక్షన్ పొందుతారు. తర్వాత కుటుంబ అవసరాలు, ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ అదనపు పరికరాలు కొంటారు. దీంతో కరెంటు వినియోగం పెరుగుతుంది. తీసుకున్న కనెక్షన్ స్థాయికి మించి విద్యుత్ వాడకం జరుగుతుంది. ఇదే ఇప్పుడు సర్కారుకి ఆశగా.. అవకాశంగా మారిపోయింది. కనెక్షన్ తీసుకున్న సమయంలో పేర్కొన్న కెపాసిటీకి మించి విద్యుత్ వాడడంతో కిలోవాట్‌కు అదనంగా డెవల్‌పమెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు, అప్లికేషన్ ఫీజు, సూపర్‌విజన్ ఛార్జీలు, ఎస్‌జీఎస్టీ, సీజీఎస్టీ తదితరాల పేరిట మొత్తంగా రూ. 1800 వరకూ చెల్లించాల్సి వుంటుంది.
ఏసీ ఉపయోగిస్తే నెలకు అదనంగా రెండు కిలోవాట్ల విద్యుత్ వాడకం వుంటుంది. దీంతో కొత్తగా ఏసీలు ఉపయోగిస్తున్న వారిని అదనపు మొత్తాలు చెల్లించమంటూ విద్యుత్‌శాఖ నోటీసులు పంపిస్తోందని జనం గగ్గోలు పెడుతున్నారు. గడువులోగా చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామన్న హెచ్చరికలు నోటీసులో వుంటున్నాయి. సగటున చూస్తే ఏసీలు కొని నెల పాటు వాడిన వారందరికీ కనీసమంటే రూ. 4 వేలు చెల్లించాలని నోటీసులు జారీ అవుతున్నాయి. వినియోగదారులు ఈ నోటీసులు చూసి బెంబేలెత్తిపోతున్నారు. వేసవిలో జగనన్న ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక కానుక ఇది అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ac, Andhra Pradesh, Power problems