మూడు రోజుల పాటు జోరుగా వర్షాలు..

Rains : తెలంగాణలో వచ్చే 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.

news18-telugu
Updated: October 22, 2019, 6:34 AM IST
మూడు రోజుల పాటు జోరుగా వర్షాలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 22, 2019, 6:34 AM IST
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ చత్తీస్‌గఢ్‌ వరకు ఉత్తర కర్ణాటక, తెలంగాణ మీదుగా 2.1 కి.మీ ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ తమిళనాడు, ఉత్తర శ్రీలంక, కోమోరిన్‌ ప్రాంతాల నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించింది. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో పాటు, ఈ నెల 23న దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల ఏపీలో జోరుగా వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విపత్తుల శాఖ అప్రమత్తమైంది. తీరం వెంబడి ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...