వైఎస్ కుటుంబంపై బాంబు పేల్చిన సబ్బం .. తాను చెప్పేది పచ్చి నిజం అంటూ..

సబ్బం హరి(ఫైల్ ఫొటో)

వైఎస్ ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో మాజీ ఎంపీ సబ్బం హరి ఒకరు. వైఎస్ జగన్ కాంగ్రెస్‌ను ధిక్కరించి వేరు కుంపటి పెట్టిన సందర్భంలో, ఓదార్పు యాత్రలో ఆయన వెన్నంటి ఉన్న వారిలో సబ్బం హరి ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాటను...

 • Share this:
  హైదరాబాద్: వైఎస్ ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో మాజీ ఎంపీ సబ్బం హరి ఒకరు. వైఎస్ జగన్ కాంగ్రెస్‌ను ధిక్కరించి వేరు కుంపటి పెట్టిన సందర్భంలో, ఓదార్పు యాత్రలో ఆయన వెన్నంటి ఉన్న వారిలో సబ్బం హరి ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాటను నిజం చేస్తూ సబ్బం హరి అనూహ్య పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్‌కు బద్ధ శత్రువుగా మారారు. తాజాగా సబ్బం హరి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైఎస్ ఫ్యామిలీపై బాంబు పేల్చారు. గత కొంతకాలంగా షర్మిల సొంత పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా సబ్బం హరి తాజా వ్యాఖ్యలున్నాయి. జగన్ జైలులో ఉన్నప్పుడే ఈ విష బీజాలు వారి మధ్యలో నాటుకున్నాయని సబ్బం హరి చెప్పుకొచ్చారు.

  విశాఖ ఎంపీ స్థానానికి షర్మిలను పోటీకి నిలపాలని భావించారని, చివరాఖరుకు విజయమ్మను పోటీకి నిలిపారని తెలిపారు. అప్పటి నుంచే గ్యాప్ వచ్చిందని చెప్పారు. షర్మిల, అనిల్ ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ చేయించారని, ముహూర్తాలు, జాతకాలు కూడా చూపించుకుంటున్నారని హరి చెప్పుకొచ్చారు. తాను చెప్పేది పచ్చి నిజమని ఆయన బల్లగుద్ది మరీ చెప్పడం గమనార్హం. అంతేకాదు, సీఎం జగన్‌పై కూడా సబ్బం హరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో మరో బలీయ శక్తి ఎదగకూడదన్న ఉద్దేశంతోనే షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను సీఎం జగన్ దూరంగా ఉంచారని, జగన్‌తో పెరిగిన దూరం వల్లే షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారని సబ్బం హరి చెప్పారు. వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన కొందరితో షర్మిల భర్త అనిల్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. షర్మిల పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్న తరుణంలో కుటుంబం పరువు రోడ్డున పడకుండా ఉండేందుకు విజయమ్మ రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సబ్బం హరి వ్యాఖ్యానించారు.

  వైఎస్ గురించి, ఆయన కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఎంతోమంది, వైసీపీ అధికారంలోకి వచ్చాక పదవులు అనుభవిస్తుంటే, పార్టీ కోసం పాదయాత్ర చేసి కష్టపడిన తన బిడ్డ షర్మిలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని విజయమ్మ ఆగ్రహంతో ఉన్న మాట వాస్తవమని సబ్బం హరి చెప్పారు. అయితే.. షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ గతంలో ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని షర్మిల కొట్టిపారేశారు. ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పని షర్మిల మండిపడ్డారు. తాజాగా సబ్బం హరి చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
  Published by:Sambasiva Reddy
  First published: