విశ్వేశ్వరయ్య గురించి తెలుగువాళ్లు ఏం తెలుసుకోవాలి?

ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. వందేళ్లు కాదు... తరతరాలకు గుర్తుండిపోయేలా విశ్వేశ్వరయ్య తెలుగునేలపై చూపిన ప్రతిభ ప్రపంచంలోని ఇంజనీర్లకు గొప్ప పాఠాలు.

Santhosh Kumar S | news18-telugu
Updated: September 17, 2018, 10:50 AM IST
విశ్వేశ్వరయ్య గురించి తెలుగువాళ్లు ఏం తెలుసుకోవాలి?
మోక్షగుండం విశ్వేశ్వరయ్యపై గూగుల్ డూడుల్
  • Share this:
మోక్షగుండం విశ్వేశ్వరయ్య... 15 సెప్టెంబర్ ఆయన జయంతి. ఆయన భారతరత్నగా అందరికీ తెలుసు. ఇంజనీర్ల పితామహుడు అని కీర్తిస్తుంటారు. ఇప్పుడు గూగుల్ కూడా ఆయనపై ప్రత్యేకంగా డూడుల్ రూపొందించి భారతీయులకు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను మళ్లీ గుర్తుచేసింది. ఆయనెవరో, చేసిన సేవలేంటో తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. విశ్వేశ్వరయ్య గురించి భారతదేశమంతా తెలుసుకోవడం వేరు. ఆయన గురించి తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది వేరు. ఎందుకంటే... తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. వందేళ్లు కాదు... తరతరాలకు గుర్తుండిపోయేలా విశ్వేశ్వరయ్య తెలుగునేలపై చూపిన ప్రతిభ ప్రపంచంలోని ఇంజనీర్లకు గొప్ప పాఠాలు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప ఇంజనీర్ ఆయన.

సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య... సర్ ఎంవీగా పిలుస్తుంటారు. 1861 సెప్టెంబర్ 15న అప్పటి మైసూర్ సామ్రాజ్యంలోని చిక్కబళ్లపురలోని ముద్దెనహళ్లిలో జన్మించారాయన. ఇప్పుడా ప్రాంతం కర్నాటకలో ఉంది. విశ్వేశ్వరయ్య తండ్రి స్కూల్ టీచర్. కానీ 12 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు విశ్వేశ్వరయ్య. ఆ దు:ఖాన్ని దిగమింగుతూనే బెంగళూరులో హైస్కూల్ విద్య పూర్తి చేశారు. 1881లో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ అంటే ఇప్పుడు కనీస అర్హతగా మారిపోయింది కానీ... ఆరోజుల్లో డిగ్రీ చదవడమంటే అదో గొప్ప విజయం. ఆ తర్వాత పూణెలోని కాలెజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరారు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. బొంబాయ్‌లోనే కొన్నాళ్లు పనిచేసి ఆ తర్వాత ఇండియన్ ఇరిగేషన్ కమిషన్‌లో చేరారు. అప్పుడే భారతదేశానికి ఓ మేధావి గురించి తెలిసింది.

Sir Mokshagundam Visvesvaraya, Engineers Day, Bharat Ratna, Google Doodle, Dam Builder, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, గూగుల్ డూడుల్, భారతరత్న, డ్యామ్ బిల్డర్
image: Wikimedia Commons


1903లో పూణె సమీపంలోని ఖదక్‌వాస్తా రిజర్వాయర్‌కు ఆటోమెటిక్ వెయిర్ వాటర్ ఫ్లడ్‌గేట్స్ ఏర్పాటు చేశారు. ఆయన సొంతగా డిజైన్ చేసిన ఈ సిస్టమ్‌కు పేటెంట్ కూడా దక్కింది. డ్యామ్‌కు ఎలాంటి డ్యామేజీ లేకుండా వరద నీటిని స్టోర్ చేసుకునేందుకు వీలుపడింది. అక్కడ ఆ ప్రయోగం విజయవంతం కావడంతో గ్వాలియర్‌లోని టిగ్రా డ్యామ్, మైసూర్‌లోని క్రిష్ణ రాజ సాగర డ్యామ్‌ దగ్గరా అలాంటి గేట్లే ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్య ప్రతిభ, ఆయన చేస్తున్న సేవల్ని గుర్తించిన అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1906-07లో నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు ఏడెన్‌కు పంపించింది.

హైదరాబాద్ వరదలకు విశ్వేశ్వరయ్య అడ్డుకట్ట
హైదరాబాద్‌ చరిత్రలోనే అవి అత్యంత భారీ వరదలవి. కనీవినీ ఎరుగని రీతిలో మూసీ నది ఉప్పొంగింది. 50 వేల మంది హైదరాబాదీలను పొట్టనబెట్టుకుంది. 17 సెంటీమీటర్ల వర్షం కురవడంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. హైదరాబాద్‌ రెండుగా చీలింది. అలా చీలిపోయిన హైదరాబాద్‌కు పురానాపూల్ బ్రిడ్జీ మాత్రమే వారధిగా మిగిలింది. అప్పుడు హైదరాబాద్‌ను ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నారు. హైదరాబాద్ మరోసారి ఇలాంటి భారీ వరదల్ని చూడొద్దని అనుకున్నారాయన. అందుకోసం విశ్వేశ్వరయ్య సేవల్ని వాడుకోవాలనుకున్నారు.

వరద రక్షణ వ్యవస్థతో పాటు డ్రైనేజీ వ్యవస్థను రూపొందించేందుకు విశ్వేశ్వరయ్య హైదరాబాద్‌కు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన సలహా మేరకే గండిపేట్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. మూసీ నుంచి తరలివచ్చే వరదకు అక్కడే అడ్డుకట్టపడింది. అంతేకాదు... ఈ జలాశయాల్లో నిల్వచేసిన నీళ్లే హైదరాబాదీల దాహార్తిని తీరుస్తున్నాయి. ఆనాడు విశ్వేశ్వరయ్య చూపిన ప్రతిభే మహానగరానికి వరద ముప్పును శాశ్వతంగా దూరం చేసింది.
Sir Mokshagundam Visvesvaraya, Engineers Day, Bharat Ratna, Google Doodle, Dam Builder, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, గూగుల్ డూడుల్, భారతరత్న, డ్యామ్ బిల్డర్
image: Wikimedia Commons


విశాఖపట్నానికీ విశ్వేశ్వరయ్య సేవలు
హైదరాబాద్‌ను వరదలు అతలాకుతలం చేసినట్టు... ఆసయమంలో విశాఖపట్నాన్ని సముద్రం చీల్చేస్తోంది. సముద్రపు కోతను ఎలా అడ్డుకోవాలో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడే అందరికీ విశ్వేశ్వరయ్య గుర్తొచ్చారు. సముద్రపు కోత నుంచి తీరాన్ని రక్షించే వ్యవస్థను రూపొందించి విశాఖను కాపాడారు విశ్వేశ్వరయ్య. అంతేకాదు... ఇప్పటివరకు కోట్లాది మంది ప్రయాణించిన తిరుమల, తిరుపతి ఘాట్ రోడ్డు నిర్మాణానికీ ప్లాన్ రూపొందించింది కూడా ఆయనే. కావేరీ నదిపై ఆసియాలోనే అతిపెద్ద డ్యామ్, బీహార్‌లో మొకామా బ్రిడ్జీ, ప్రభుత్వ సబ్బుల ఫ్యాక్టరీ, జోగ్ ఫాల్స్ దగ్గర హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, బెంగళూరు-మైసూర్ రైల్ రోడ్డు మార్గం నిర్మాణాల వెనుక విశ్వేశ్వరయ్య ప్రతిభే కారణం. సౌత్‌ బెంగళూరులోని జయనగర్‌ను పూర్తిగా డిజైన్ చేసింది కూడా ఆయనే. ఆసియాలోని ఉత్తమ లేఅవుట్స్ అందించిన వ్యక్తిగా విశ్వేశ్వరయ్య పేరు తెచ్చుకున్నారు.

విశ్వేశ్వరయ్య కొంతకాలం మైసూర్ దివాన్‌గా పనిచేశారు. ఆయన సమయపాలన, నీతి, నిజాయితీ, విలువల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. దివాన్‌గా పనిచేసే సమయంలో విశ్వేశ్వరయ్య జేబులో రెండు పెన్నులుండేవి. అందులో ఒకటి కార్యాలయానికి సంబంధించిన పెన్ అయితే రెండోది తన వ్యక్తిగత పెన్. అంటే ఆఫీసు పెన్నును కూడా తన వ్యక్తిగత అవసరాలకు వాడుకోనంత నిజాయితీ ఆయనది. అంతేకాదు ఆయన కార్యాలయానికి వచ్చే టైమ్ చూసి అందరూ గడియారాలు సరిచేసుకునేవారట. ఆయన సమయపాలన అలా ఉండేది.


ఏడేళ్లు దివాన్‌గా పనిచేసిన విశ్వేశ్వరయ్య... 1927-1955 వరకు టాటా స్టీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఇంజనీర్‌గా భారతదేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ ఆయనకు 1955లో భారతరత్న పురస్కారాన్ని అందించింది ప్రభుత్వం. నిండు నూరేళ్లు జీవించిన విశ్వేశ్వరయ్య... 1962 ఏప్రిల్ 14న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన పేరు మీద భారతదేశమంతా ఎన్నో విద్యాసంస్థలున్నాయి. ఇప్పటికీ ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటారు ఈ తరం ఇంజనీర్లు. విశ్వేశ్వరయ్య పుట్టినరోజును ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

విశాఖలో గూగుల్ 'నైబర్లీ' సేవలు!

2019 మార్చి నుంచి 'ఇన్‌బాక్స్' యాప్ కనిపించదు!

19న షావోమీ ఎంఐ 8 యూత్ లాంఛింగ్!

ఐఫోన్ ఎక్స్ఎస్: ఏ దేశంలో రేటెంత?

భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు!

పెట్రోల్ కొంటారా? పేటీఎం సూపర్ ఆఫర్!
First published: September 15, 2018, 11:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading