ELURU MYSTERY DISEASE SEVERAL REPORTS SUGGEST PESTICIDES MAIN CULPRIT SU GNT
Eluru Mystery Disease: ఏలూరు వింతవ్యాధిపై పలు సంస్థల రిపోర్ట్స్.. ఆందోళన చెందుతున్న స్థానికులు
ఏలూరు వింత వ్యాధి బాధితులు (ఫైల్ ఫోటో)
Eluru Mystery Disease: ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏలూరు పరిసర ప్రాంతాల్లో కలకలం రేపిన ఈ వ్యాధి బారిన పడి దాదాపు 600కి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారు
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏలూరు పరిసర ప్రాంతాల్లో కలకలం రేపిన ఈ వ్యాధి బారిన పడి దాదాపు 600కి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వింత వ్యాధి బాధితుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఇందుకు గల కారణాలపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏలూరు వింత వ్యాధికి కచ్చితమైన కారణాలను కనుక్కోవాలని కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులను సీఎం జగన్ కోరారు. ఇలా జరగడానికి గల కారణాలను కచ్చితంగా గుర్తించాలని, వీలైనంత త్వరగా అన్ని రకాల పరీక్షలను పూర్తి చేయాలని అధికారులకు సూచిస్తున్నారు. ఇక, పూర్తి స్థాయి నివేదకలు వచ్చాకే వింత వ్యాధి కారణలపై ప్రకటన చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. తుది నివేదిక రావడానికి మరికొద్ది రోజుల సమయం పడుతుందని చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా సమస్య పరిష్కారానికి ఏలూరు పరిసర ప్రాంతాల్లో శాశ్వత చర్యలు చేపడతామని తెలిపారు.
ఇదిలా ఉండే ఇప్పటివరకు వెలువడిన పలు సంస్థల ప్రాథమిక రిపోర్ట్స్ మాత్రం.. వ్యవసాయానికి భారీగా పురుగుల మందులు వాడటమే కారణమని పేర్కొంటున్నాయి. వింత వ్యాధి బారిన పడిన బాధితుల రక్తంలో సీసం, నికెల్ ఉన్నట్టుగా ఎయిమ్స్ తెలిపింది. మరికొన్ని సంస్థలు మాత్రం బాధితులు తీసుకున్న ఆహారంలో పురుగుల మందు వంటి రసాయనాల అవశేషాలు ఉన్నట్టుగా ప్రాథమిక పరిశోధన ఫలితాల్లో వెల్లడించాయి. ఈ ఫలితాలను స్థానికులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆహారంలో రసాయనాలు ఉండటం భవిష్యత్తులో తమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడిపోతున్నారు.
మరోవైపు ఏలూరు వింత వ్యాధి బాధితుల్లో ధైర్యం నింపేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బాధితులను మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునే వరకు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని.. మందులు వాడాలని సూచించారు. అలాగే పలు ప్రాంతాల్లో పారిశుద్ద్యం ఏ విధంగా ఉందో కూడా మంత్రి పరిశీలించారు. పారిశుద్ధ్యం పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.