ELURU FIRE ACCIDENT AP CM YS JAGAN MOHAN REDDY ANNOUNCES RS 25 LAKHS EX GRATIA FOR THE FAMILIES OF DECEASED WORKERS SK
Eluru Fire Accident: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు.. ఏలూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సీఎం వైఎస్ జగన్ (ఫైల్)
Eluru Fire Accident: రాత్రి 11 గంటల సమయంలో .. పోరస్ ఔషధ ఫ్యాక్టరీ (Porus Laboratories)లో గ్యాస్ లీకవడంతో రియాక్టర్ పేలింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి యూనిట్-4లో రెండంతస్తులు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి
ఏలూరు జిల్లాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం (Eluru Fire Accident)పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. తీవ్రగా గాయాలైన వారికి రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.2 లక్షలను ఇస్తామని తెలిపారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని సీఎం జగన్ ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ఆదేశాలు జారీచేశారు.
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల సమయంలో .. పోరస్ ఔషధ ఫ్యాక్టరీ (Porus Laboratories)లో గ్యాస్ లీకవడంతో రియాక్టర్ పేలింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి యూనిట్-4లో రెండంతస్తులు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలన్నీ కాలిబూడిదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు వెలువడంతో కార్మికులు ఉకిరిబిక్కిరయ్యారు. ప్రమాదం జరిగిన యూనిట్లో 30 మంది కార్మికులు ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే కొందరు బయటకు పరుగులు తీశారు. మరికొందరు బయటకు రాలేని పరిస్థితిలో అక్కడే ఉండిపోయి.. ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొని మంటలను అదుపుచేశారు.
ప్రమాదంలో ఐదుగురు స్పాట్లోనే మరణించగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మార్గమధ్యలో చనిపోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డవారు. వారికి ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో నలుగురు బీహార్ వాసులు ఉన్నారని స్థానికులు తెలిపారు. పోరస్ ఫ్యాక్టరీ నుంచి అర్ధరాత్రి పెద్ద ఎత్తున పేలుడు శబ్ధాలు వినిపించాయని.. పెద్ద ఎత్తున మంటలు కనిపించాయని చెప్పారు. ఆ మంటలను చూసి అక్కిరెడ్డిగూడెం గ్రామస్తుల్లో చాలా మంది భయంతో వెళ్లిపోయారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే మళ్లీ వచ్చారు. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. 12 మందికి 70శాతానికి పైగా శరీరం కాలిపోయిందని..వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని విజయవాడ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణమేంటి? గ్యాస్ ఎలా లీకయింది? మానవతప్పిదమా? లేదంటే సాంకేతిక కారణమా? అని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లారు. ఫ్యాక్టరీ లోపలికి వెళ్లి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఐతే ప్రమాదం తర్వాత పోరస్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. వారు సకాలంలో స్పందించి ఉంటే.. ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని కార్మికులు ఆరోపిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.