ఏ జీవికి అయిన తన బిడ్డతో ఆటలాడితే కోపం నషాలానికి అంటుతుంది. అవతల ఉన్నది ఎవరైనా సరే చీల్చి చెండాడుతుంది. ఈ విషయంలో ఏనుగులకు కాస్త కోపం ఎక్కువే. నార్మల్ గా డిస్టర్బ్ చేస్తే గజరాజులు రెచ్చిపోతాయి. అందునా వాటి పిల్లల జోలికి వస్తే మాత్ర వారితో ఫుడ్ బాల్ ఆడతాయి. అలాంటి ఘటనే ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం మండలం, కేశుపురం, లక్ష్మీపురం, బూర్జపాటు గ్రామాల పరిసరాల్లో మూడు రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తోంది. సమీపంలోని తోటలు, అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఒడిశా రాష్ట్ర పరిధిలోని సుర్లా ప్రాంతానికి చేరుకున్నాయి. ఈక్రమంలో సుర్లా-స్వర్ణాపురం తీరంలో బహుదానది దాటుతుండగా ఓ చిన్న ఏనుగు చిక్కుకుపోయింది.
గున్న ఏనుగు చిక్కుకుపోవడాన్ని గమనించిన స్థానిక యువకులు దానిని ఒడ్డుకు లాక్కొచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. దీన్ని చూసిన తల్లి ఏనుగు ఆగ్రహంతో ఊగిపోయింది. నా పిల్లతోనే ఆటలా అంటూ వెనక్కి దూసుకొచ్చింది. ఐతే నదిలో చేపలు పడుతున్న ఓయువకుడు ఏనుగు రాకను గమనించకుండా అక్కడే ఉండిపోయాడు. దీంతో అతడిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఏనుగు రాకతో బెంబేలెత్తిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు.
ఇటీవల ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఏనుగుల సంచాలం ఎక్కువైంది. జనావాసాల్లోకి వస్తున్న గజరాజులు సమీప గ్రామాల్లో పంటలు, తోటలను ధ్వంసం చేస్తున్నాయి. అటు విజయనగరం ఏజెన్సీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కురుపాం, పార్వతీపురం ప్రాంతాల్లో మదగజాల దాడిలో రైతులు గాయపడుతున్నారు. భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. ఏనుగుల దాడి నుంచి అటవీ పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు అటు ఫారెస్ట్, ఇటు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడటం లేదు.
అడవులను నరికివేస్తుండటం, జంతువులను వేటాడుతుండటంతో ఆహారం కోసం కొన్ని జంతువులు ఊళ్ల మీద పడుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలు వంటివి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు మునుషులపైనా దాడి చేసి చంపేస్తున్నాయి. ఇటీవల విశాఖ ఏజెన్సీలో ఓ ఎలుగు గిరిజనుడిపై దాడి చేయగా.,విజయనగరం జిల్లా ఏజెన్సీలో నిత్యం ఏనుగుల మంద గ్రామాలై పడి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అటు చిత్తూరు జిల్లా రామకుప్పం ప్రాంతంలోనూ ఏనుగులు ఆహారం కోసం గ్రామాలపై దాడి చేస్తున్నాయి. తిరుపతి ఘాట్ రోడ్డు, పరిసర ప్రాంతాల్లోనూ చిరుతలు, ఇతర అడవి జంతువులు ఆహారం కోసం రోడ్లపైకి రావడం ఇటీవల సర్వసాధారణంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Elephant attacks, Odisha, Srikakulam