తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్డు ధరలు భారీగా పెరిగాయి. గతంలో రూ.4కే దొరికే కోడిగుడ్డు ఇప్పుడు రూ.6 పలుకుతోంది. కొన్ని చోట్ల 7 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. నెక్ ధర ప్రకారం హోల్‌సేల్‌గా 100 గుడ్లు రూ.515 వరకు పలుకుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణలో 100గుడ్లు రూ.420 లోపు ఉంటే.. ఏపీలో రూ.450 దాకా ఉంది. రెండో వారంలో అది రూ.500కు చేరింది. ఈ వారం రోజుల్లో కోడి గుడ్ల ధర మరింతగా పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 100 గుడ్ల ధర రూ.500గా ఉంటే... విశాఖలో రూ.515గా ఉంది. కొన్ని కోళ్ల ఫారాల్లో గుడ్డు రూ.6చొప్పున డజను రూ.72 పలుకుతోంది. ఇక చిరు వ్యాపారులు రూ.7కి అమ్ముతున్నారు.
గుడ్ల ఉత్పత్తి దాదాపు 50% వరకు తగ్గిపోవడం, కరోనా నేపథ్యంలో స్థానిక వినియోగం పెరగడం ప్రధాన కారణాలుగా పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. గుడ్లు తింటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని డాక్టర్లు, ప్రభుత్వాలు ప్రచారం చేయడంతో వీటికి డిమాండ్ పెరిగింది. అదే సమయంలో ఉత్పత్తి తగ్గడంతో రేట్లు పెరిగాయని తెలిపారు. ఏపీలో ఏటా సుమారు 2వేల కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. కానీ గత ఆరు నెలల్లో సగానికి సగం కోడిగుడ్ల ఉత్పత్తి పడిపోయింది. లాక్డౌన్ వల్ల ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రవాణా నిలిచిపోయి కోళ్ల ఫారాలకు సకాలంలో దాణా అందలేదు. పెద్ద మొత్తంలో కోళ్లు మృత్యువాతపడ్డాయి.
రవాణా వ్యవస్థ స్తంభించడంతో కొత్తగా పిల్లలు వేసే అవకాశమూ లేకుండా పోయింది. అంతేకాదు అప్పటికే నష్టపోయిన పౌల్ట్రీ రైతులు కొంతకాలం వరకు కోళ్లను పెంచవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఉత్పత్తి బాగా పడిపోయింది. ఏపీలో రోజుకు సగటున 3.65 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం అది 2.80 కోట్లకు తగ్గింది. అందులోనూ సగం పొరుగు రాష్ట్రలకు ఎగుమతి అవుతుండటంతో ఏపీలో ప్రతిరోజు 1.4 కోట్ల కోడిగుడ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అదే సమయంలో స్థానికంగా కోడిగుడ్ల వినియోగం పెరిగింది. వీటికి తోడు కోళ్ల దాణా, రవాణా చార్జీలు పెరగడం కూడా కోడి గుడ్ల ధర పెరుగుదలకు కారణమైందని పౌల్ట్రీ వ్యాపారులు వెల్లడించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.