వాహనాల కుంభకోణం కేసులో ఈడీ (Enforcement Directorate) దూకుడు పెంచింది. నిన్న హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో టీడీపీ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని (JC Prabhakar Reddy) అధికారులు 8 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక తాజాగా రెండో రోజు ఆయన ఈడీ ముందుకు రానున్నారు. నిన్న మీడియాతో ఆయన మాట్లాడుతూ..రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈడీ (Enforcement Directorate) అధికారులు కేవలం 31 లారీల విషయంలో ప్రశ్నించారు కానీ రూ.వేల కోట్ల కుంభకోణం అనేది దుష్ప్రచారమే అని కొట్టిపారేశారు.
ఈడీ (Enforcement Directorate) ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు లాగా ఈడీ కాదని ఎంతో హుందాగా వ్యవహరించారన్నారు. తాను ఎలాంటి మనీ లాండరింగ్ కు పాల్పడలేదన్నారు. బస్సుల కొనుగోళ్లపై మాత్రమే ఇది అధికారులు ప్రశ్నించారని తెలిపారు. నిజాయితీని నిరూపించుకోడానికి ఈడీ (Enforcement Directorate) కార్యాలయం ఓ వేదిక అని అన్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మరి నేటి విచారణలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది. విచారణ అనంతరం మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది.
BS 3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించింది. కానీ ఆ వాహనాలను BS-4 వాహనాలుగా చూపించి రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. స్క్రాప్ కింద అశోక్ లేలాండ్ లో కొన్న 154 బస్సులను ఫోర్జరీ డాక్యూమెంట్లతో నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్రేషన్ చేయించి NOC పొందినట్లు ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ గుర్తించింది. ఆ బస్సుల్ని 15 రోజుల్లో ఏపీ, తెలంగాణ , ఛత్తీస్ ఘడ్, తమిళనాడులో రిజిస్ట్రేషన్ చేయించారు. దీనితో జేసీ ట్రావెల్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. అలాగే బస్సుల కొనుగోలు వ్యవహారంకు సంబంధించి మనీ లాండరింగ్ చోటు చేసుకుందనే ఆరోపణలపై ఈడీ (Enforcement Directorate) దర్యాప్తు చేస్తుంది.
ఇక అనంతపురం పోలీసులు దీనికి సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. 2020లో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరో 12 మందిపై వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య, కుమారుడు, అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డితో సహా 13 మందిపై కోర్టులో ఛార్జ్ షీట్ వేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.