P Ramesh, News18, Kakinada
ఒకపక్క జోరు వాన కురుస్తున్నా మహిళల పోరు ఏ మాత్రం ఆగలేదు. తమ సమస్యకు పరిష్కారం చూపేవరకు కదిలేదే లేదంటూ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. వర్షంలో తడుస్తూ మహిళలు నిరసన చేయడం ఇప్పుడు కోనసీమ జిల్లా (Konaseema District) లో సంచలనం రేపుతోంది. మహిళలు ఎంత సౌమ్యంగా ఉంటారో..ఆగ్రహిస్తే ఆదిశక్తి రూపాన్ని కూడా వారిలో చూడవచ్చు. అన్ని రంగాల్లో ఈ రోజు తమదైన ముద్ర వేసుకుంటున్నారు. ఉదయం లేస్తే మహిళలు పడుతున్న కష్టం వెలకట్టలేనిది. ఇంటి పని దగ్గర నుండి కార్యాలయాల్లో పనులు, ఉపాధి రంగం, వ్యక్తిగత వ్యాపారాలు ఇలా చూస్తే మగవాళ్లతో అన్నిరంగాల్లో పై చేయి సాధిస్తున్నారు మహిళలు. అలాంటి మహిళలు వారి వారి పనుల్లో నిమగ్నమవుతూనే అటు సమాజ సేవకు దగ్గరవుతున్నారు.
ఈ రోజుల్లో కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను మహిళల ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. అవసరమైతే రోడ్డెక్కి మరీ తమ ఆందోళనను తెలుపుతున్నారు. ఇలాంటి మహిళల నిరసన ఒకటి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంచలనంగా మారింది. కోనసీమ జిల్లాలో ప్రస్తుతం ఎక్కడా రోడ్లు బాగోలేదు. దీనిపై ఎక్కడికక్కడ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రాయవరం మండల కేంద్రంలో రోడ్లపై ఏకంగా ఆ ప్రాంతంలోని మహిళలు తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇంతలా మహిళలు నిరసన తెలుపుతుండటం సంచలనంగా మారుతుంది.
వాన, వరదలను లెక్కచేయని ఆందోళన..!
వానలు జోరువాన కురుస్తున్నా ఎక్కడా కదలకుండా రోడ్డుపై కూర్చుండిపోయారు. రాయవరం మండల కేంద్రంలో ఆంధ్రాబ్యాంకు పరిసర ప్రాంతానికి చెందిన మహిళలు అక్కడ రోడ్డుపై ఏర్పడ్డ గోతుల వద్ద నిలబడి నిరసన చేపట్టారు. అక్కడ గోతులు కూడా వర్షపు నీళ్లకు చెరువులను తలపించడంతో అక్కడే ఆ ప్రాంతం వద్ద ఉండిపోయి నినాదాలు చేశారు. ఇదే సమయంలో వర్షం మరింత భారీగా పెరిగిపోయినప్పటికీ వాళ్లు అక్కడ నుంచి ఇంచు కూడా కదల్లేదు.
ఈ విషయం తెలుసుకున్న అక్కడి వారు పెద్ద ఎత్తున అదే వర్షంలో వచ్చి మహిళల నిరసనకు సంఘీభావం తెలిపారు. రాయవరంలోని ఆంధ్రాబ్యాంకు రోడ్డు బాగోలేదని, రోడ్డు నిర్మించాలని కోరితే, ఉన్న రోడ్డును తవ్వుకుపోవడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.
దిగివచ్చిన అధికారులు..!
మహిళల నిరసనతో అధికారులు స్పందించారు. జోరు వానలో నిరసన తెలుపుతున్న మహిళ వివరాలు తెలుసుకున్న ఆర్ అండ్ బి అధికారులు నిరసన తెలుపుతున్న మహిళలతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సమయంలో మహిళలు నేరుగా అధికారుల తీరును దుమ్మెత్తిపోశారు. చివరకు స్థానిక నాయకులు, అధికారులు మహిళలను శాంతింపజేయడంతో వారు నెమ్మదించి నిరసన విరమించారు. అయితే రోడ్డు నిర్మాణం కోసం మహిళలు భారీ వర్షంలో తడుస్తూ నిరసన తెలపడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News