P Ramesh, News18, Kakinada
ఈ మధ్యకాలంలో వేదిక ఏదైనా సరే అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. అది అసెంబ్లీ అయినా, మున్సిపల్ కౌన్సిల్ అయినా..! తాజాగా కాకినాడ జిల్లా (Kakinada) మండపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రెండు పార్టీలు యుద్ధానికి దిగినంత పనిచేశాయి. అభివృద్ధి తమదంటే తమదని వైసీపీ టీడీపీ కౌన్సిల్ సభ్యులు వాగ్వాదానికి దిగారు.టిడ్కో అపార్ట్మెంట్లు పై మండపేట మున్సిపల్ కౌన్సిల్లో ఆసక్తికర చర్చ జరిగింది. పురపాలక సంఘ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ అజెండాకు సంబంధించిన 18 అంశాలను ఆమోదించారు. కాగా గొల్లపుంత టిడ్కో అపార్ట్మెంట్లలో సౌకర్యాలు లేవని టిడిపి కౌన్సిలర్లు ఆరోపించారు. అన్ని హంగులతో అందరికీ ఇస్తామని స్వయంగా మంత్రి చెప్పినా అక్కడ ఎలాంటి వసతులు లేవంటూ చిత్తశుద్ధిలేని ప్రభుత్వమని టిడిపి కౌన్సిలర్ చుండ్రు సుబ్బారావు చౌదరి ధ్వజమెత్తారు.
తమ ప్రభుత్వ హయాంలో 95% పనులు పూర్తయితే మిగిలిన మూడున్నరేళ్ళలో ఐదు శాతం పనులు కూడా చేయలేని అసమర్ధత ప్రభుత్వమని వైసిపి పై మండిపడ్డారు. దీంతో చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి మాట్లాడుతూ ఏదో సాధించేసామని గొప్పలు చెప్పుకునే టిడిపి నాయకులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేకలు అరుపులు వేయడానికి కాకుండా కౌన్సిల్ లో ప్రజాసమస్యలపై గళమెత్తితే సమంజసం గా ఉంటుందని చురకలు వేశారు.
95% పనులు పూర్తయితే ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ల వద్ద అన్ని బ్లాక్లు నిండిపోయి ఉండాలి కదా అంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. ఈ దశలో కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో రాజీవ్ గృహ కల్ప లో డ్రైన్ లో మోటర్ వేసి మురికి నీరు సరఫరా చేసారని దుయ్యబట్టారు. దీనిపై సుబ్బారావు చౌదరి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అసంపూర్తి గా నిలిచి రాజీవ్ గృహ కల్ప కు రూ 7 కోట్లు గ్రాంటు గా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెచ్చిలబ్ధిదారులకు ఉచితంగా ఇళ్ళు ఇచ్చారని పేర్కొన్నారు. టిడ్కో పై టీడీపీ కౌన్సిలర్ లు యారమాటి గంగరాజు, కాసిన కాశి, కాళ్ళకురి స్వరాజ్య భవాని, వైసీపీ కౌన్సిలర్ లు మందపల్లి రవి కుమార్, పిల్లి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్, పోతంశెట్టి ప్రసాద్ ల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఓ దశలో సభ లో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఒకరి పై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు.
టిడిపి వార్డులపై వివక్ష..
టీడీపీ వార్డులపై వివక్షత చూపుతున్నారని కాళ్ళకురి భవాని ఆగ్రహం వ్యక్తంచేశారు. 21 వ వార్డు లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కౌన్సిల్ ఏర్పడిన నాటి నుండి మొర పెట్టుకున్న స్తంభాలు ఏర్పాటు చేయలేదని ఆ వార్డు కౌన్సిలర్ చింతలపూడి దుర్గా ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్ లు యారమాటి గంగరాజు, కాసిన కాశి, కాళ్ళకురి స్వరాజ్య భవాని, శిరంగు జ్యోతి, గుండు రామ తులసిలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.కాగా ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఏ ఈ కె సత్యనారాయణ పేర్కొన్నారు.
దీనిపై ఛైర్మన్ రాణి మాట్లాడుతూ వివక్షత తముకు లేదన్నారు. అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని వివరణ ఇచ్చారు. మండపేట పట్టణంలోని అన్ని వార్డుల్లో చెత్త చెదరాలు వలన దోమలు విపరీతంగా పెరిగిపోయాయని కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్ విమర్శించారు. నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. దోమలు పెరిగి వార్డుల్లో ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News