(Ramesh, News18, East Godavari)
అడుగు తీసి అడుగు వేస్తే అభివృద్ధి..ఎక్కడకు వెళ్లిన ఊదరగొట్టే ప్రసంగాలు..పరిశుభ్రత (Cleanliness)కు ఆదర్శం. పరిపాలనలో ముందున్నాం..ఇది సాధారణంగా ప్రభుత్వాలు చెప్పుకునే ఆర్భాట ప్రసంగాలు. అయితే ఈ జిల్లాలో కూడా అదే జరుగుతోంది. ఆర్భాటమే మిగులుతోంది. కనీసం తాగునీరు (Drinking water) కూడా సక్రమంగా ఇవ్వలేని దుస్థిలో ఉన్నా అడిగే నాథుడు లేడు.
నిర్లక్ష్యమే కొంప ముంచిందా..
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో చిన్నబ్రహ్మాదేవం అనే ఓ ఊరుంది. కొద్ది రోజుల క్రితం ఈ ఊరంతా అతిసారం ప్రబలింది. దాదాపుగా గ్రామంలో 50 నుండి 80 మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత మంది ఆరోగ్యపరంగా పటిష్టంగా ఉండటంతో స్వల్ప ఇబ్బందితో బయటపడ్డారు. గ్రామంలో సరఫరా అయిన తాగునీటి వల్లే అతిసార వ్యాపించినట్లు మొత్తం మీద అధికారులు ఓ నిర్థారణకు వచ్చారు.
అక్కడే ఎందుకిలా..?
వాస్తవానికి పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాజీ హోంమంత్రి నిమ్మకాయ చిన్నరాజప్ప ఉన్నారు. ఈయన టిడిపి నుండి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పరిపాలన మొత్తం వైసీపీ ఇన్ఛార్జి దవులూరి దొరబాబు చేతుల్లోనే ఉంది. ఇక గ్రామాల విషయానికొస్తే తాగునీటి దగ్గర నుండి, పారిశుద్ధ్యం వరకూ పంచాయతీలు చూడాలి. కానీ పంచాయతీల్లో నిధులు లేకపోవడం వల్ల వాటిపై సర్పంచిలు దృష్టి సారించలేకపోతున్నారు.
అదుపులోకి వస్తున్న గ్రామం..
గ్రామంలో ఉన్న దాదాపుగా ఇళ్లల్లో ఎవరో ఒకరికి అతిసార వ్యాధి వచ్చింది. ఇలా గ్రామంలో ఎక్కువ మంది ఇబ్బందులు పడటంతో కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా స్పందించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సిలైన్లను పెట్టి రోగులకు ఊరట కల్పించారు. పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప , వైసీపీ ఇన్ఛార్జి దొరబాబులు గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగారు. దగ్గరుండి గ్రామస్తులకు అవసరమైన తాగునీటిని సరఫరా చేయించారు. తాత్కాలికంగా గ్రామంలో ట్యాంకునుండి వచ్చే తాగునీటి సరఫరాను నిలిపివేశారు. ట్యాంకు శుభ్రం చేసే దిశగాచర్యలు తీసుకున్నారు.
సీజన్ ప్రమాదమని తెలియదా..?
వాస్తవానికి ఈసీజన్ ఆరోగ్య పరంగా చాలా ప్రమాదకరం. మరో పక్క శుభ్రత లేని తాగునీరు సరఫరా అవుతోంది. వెలుగులోకి వచ్చిన చిన్నబ్రహ్మాదేవం ఒక్కటే అనుకుంటే పొరాపాటు. చాలా గ్రామాల్లో ఈపరిస్థతి ఉందనే చెప్పాలి. ముఖ్యంగా చాలా చోట్ల ఇంకా వెలుగులోకి రాని విషయాలెన్నో గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. పట్టణాల్లో తాగునీటి పైపులైన్లు పాడయ్యయి. మున్సిపాల్టీల్లో నిధులుఖర్చు పెట్టే అధికారం లేకుండా చేశారు. ఇక నగర పాలక సంస్థల్లోనూ అదే తీరు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Kakinada, Local News