Ramesh, News18, East Godavari
దేవాలయాలు అంటే పవిత్రంగా చూస్తాం. కానీ కొంత మంది పుణ్యమా అని దేవాలయాల్లో నిర్వాహణ లోపాలు బయటపడుతున్నాయి. కొన్ని చోట్ల దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పనితీరుపై కూడా అనుమానాలు రావడంతో ఎక్కడికక్కడ విచారణలు జరుగుతున్నాయి.
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఇటీవల అవకతవకలు జరిగాయనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈనేపథ్యంలో అక్కడ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టడం చూస్తుంటే పరిస్థితి చేయిదాటడంతో లోపాలు బయటపడుతున్నాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు ఇప్పటికే ఓ నివేదికను సిద్ధం చేసారు. ముఖ్యంగా దేవాలయాల పాలక మండళ్లు పనిచేస్తున్న దేవాలయాలు వివాదస్పదంగా మారాయనే ఆరోపణలు పెరిగాయి. ఇందుకు ముఖ్య కారణం, అక్కడ ప్రాంతంలో ఉన్న రాజకీయ నేతల ప్రభావం అని చెప్పవచ్చు. దేవాలయాల్లో ఉన్న ఈ రాజకీయ తతంగం మొత్తం ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఆలయాలను వీధిన పెడుతున్నారనే విమర్శలు బాగా పెరిగాయి.
అన్నవరంలో ఏం జరిగింది..?
ప్రస్తుతం అన్నవరంలో విజిలెన్స్ విచారణ ముమ్మరం చేశారు. వరుసగా రికార్డులు తనిఖీ చేస్తున్న విజిలెన్స్ అధికారులు, పలు విభాగాల్లో లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది. 2015 నుండి ఇప్పటి వరకూ జరిగిన పనులకు సంబంధించి గ్రానైట్ ఫ్లోరింగ్, కొండ దిగువ దేవస్థానం ఉద్యానవనం రక్షణ గోడ, దిగువ ఘాట్ రోడ్డులో పంపా ఘాట్ వద్ద సీసీ రోడ్డు పనులను పరిశీలించి నివేదికను సిద్ధం చేశారు. టెండర్లకు అనుగుణంగా పనులు జరిగాయా..? లేక నిబంధనలు అతిక్రమించి పనులు చేశారా అనే దానిపై పలు ప్రశ్నలను సిద్ధం చేసుకున్న అధికారులు రికార్డుల తనిఖీల అనంతరం, మరింత లోతుగా విచారణ చేసే అవకాశం లేకపోలేదు.
ఇప్పడే ఎందుకింత హడావుడి
వాస్తవానికి 2015 నుండి ఇప్పటి వరకూ జరిగిన పనులపై విచారణ అంటే, వెనుక ఎవరి పాత్ర ఉందనే దానిపై అంతా చర్చ మొదలైంది. అయితే అన్నవరం పాలక మండలిలో ఓ సభ్యుడి ఇచ్చిన ఫిర్యాదు ఆదారంగా మాత్రమే విచారణ జరిగినట్లు తెలింది. ఈవిషయాన్ని అధికారులు కూడా గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం పాలక మండలిలో ఉన్న సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయా..వాస్తవం ఏంటన్నది మాత్రం ఎవరికి అంతుచిక్కడం లేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి సభ్యులకు, గతంలో పని చేసిన పనులకు సంబంధం ఉంటుందా అనేది కూడా ఓ ప్రశ్నగా మిగిలింది. మున్ముందు ఇందులో ఇంకెన్ని వాస్తవాలు బయటపడతాయనేది మాత్రం చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News