P Ramesh, News18, Kakinada
మోసాలు పదహారాలు రకాలు అన్నట్టుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. అడుగు తీసి అడుగేస్తే మోసం చేయడం.. మోసపోవడం కామన్ గా మారింది. దొంగలు పెరిగిపోయారు. సైబర్ నేరాలు కోసం అయితే మాటల్లో చెప్పలేం. ఖాతాల్లో నగదు చూస్తుండగానే నగదు మాయమైపోతోంది. ఇదిలా ఉంటే ఎంతో నమ్మకంగా ఉండాల్సిన బ్యాంకుల్లో కూడా సిబ్బంది మోసాలకు పాల్పడటం ఇప్పుడు కొత్తగా తెరపైకి వస్తున్న అంశం. తాజాగా కాకినాడ జిల్లా (Kakinada) కాకినాడ నగరంలో జరిగిన భారీ మోసంతో జనం లబోదిబోమంటున్నారు. అవసరాల కోసం బంగారం తాకట్టు పెడితే ఏకంగా దానిని బయట తాకట్టు పెట్టుకుని, ఆ స్థానంలో నకిలీ బంగారం పెట్టి, 2 కోట్ల రూపాయాలతో ఉడాయించాడు ఘనుడు.
కాకినాడ రామారావుపేటలో ఉన్న యూకో బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్న తాడోజు శ్రీనివాసరావు అనే వ్యక్తి చేసిన మోసానికి బ్యాంకు అధికారులతోపాటు, పోలీసులు సైతం విస్తుపోతున్నారు. ఈ బ్యాంకు కాకినాడ ఖాతాదారులకు ఎంతో నమ్మకం. అయితే ఇందులో గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న అప్రైజర్ శ్రీనివాసరావు బ్యాంకు వద్దకు వస్తున్న ఖాతాదారులు ఇచ్చిన ఒరిజనల్ బంగారం స్థానంలో నకిలీ బంగారాన్ని పెట్టాడు. తనకు బాగా తెలిసిన వ్యక్తుల ద్వారా ఇదే బంగారాన్ని తిరిగి అదే బ్యాంకులో తాకట్టు పెట్టేశాడు.
ఇలా 2 కోట్ల రూపాయాల విలువైన బంగారాన్ని పెట్టి నగదు తీసుకున్నాడు. అయితే సాధారణ తనిఖీల్లో భాగంగా బంగారాన్ని తనిఖీ చేస్తుంటారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం బ్యాంకులో తాకట్టులో ఉన్న బంగారాన్ని తనిఖీ చేసిన అధికారులకు షాక్ తగలింది. బ్యాంకు లాకరులో ఉన్న ఏ బంగారు వస్తువు చూసినా నకిలీ బంగారంగా అనుమానం రావడంతో వారు లోతుగా వెళ్లారు. బంగారం పై వడ్డికీ రుణం తీసుకున్న వారందరికీ వెంటనే నోటీసులు పంపించారు. ఇదే సమయంలో అప్రైజర్‌పై అనుమానం వచ్చింది.
విషయం బయటకు రావడంతో అప్రైజర్ అక్కడ నుండి పరారయ్యాడు. బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులు కూడా బ్యాంకు అధికారులను నిలదీశారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాన్ని చక్కదిద్దామనుకున్న బ్యాంకు అధికారులకు అది సాధ్యం కాలేదు. ఈవిషయంలో పోలీసులు కూడా మినీమేషాలు లెక్కించారు. చివరకు బ్యాంకు వద్దకు బంగారం తాకట్టు పెట్టిన వారంతా ఒక్కొక్కరుగా చేరుకోవడంతో విషయం బయటపడింది. చివరకు చేసేది లేక నిందితుడు అప్రైజర్ శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలను విచారణ అనంతరం తెలియజేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. అతడు బంగారాన్ని రెండో సారి తాకట్టు పెట్టి వచ్చిన సొమ్మును ఏం చేసారనేది తేలాల్సి ఉంది.
పెరుగుతున్న బ్యాంకు మోసాలు
బ్యాంకు అంటే నమ్మకం. కానీ ప్రైవేటు బ్యాంకులు మాదిరిగానే ప్రభుత్వ బ్యాంకుల్లో కేటుగాళ్లు పెరుగుతున్నారు. ఇందుక ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ కాలం పనిచేయడం, వచ్చిన బ్యాంకు మేనేజర్‌తో సత్ససంబంధాలు పెంచుకుని, నమ్మకంగా ఉన్నట్టు నటించడంతో ఇటువంటి వ్యవహారాలకు అవకాశం కలుగుతుంది. అప్రైజర్స్ అంటే ప్రైవేటు వ్యక్తులు ఉంటారు. వీరు కమిషన్ బేసిక్‌పై పనిచేస్తారు. బంగారం నకిలీయో, కాదో నిర్థారించాల్సింది వీరే. తాకట్టు పెట్టిన గోల్డ్ చెక్ చేసిన తర్వాత బంగారంపై రుణం మంజూరవుతుంది. అయితే చాలా చోట్ల వీరు తమ పనిలో ఉన్నప్పుడు చూసిచూడనట్టుగా వ్యవహరిండచం విమర్శలకు తావిస్తోంది. దీనిపై బ్యాంకు అధికారులు తగు జాగ్రత్తలు పాటించి, ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోకపోతే సమస్యలు తప్పవని అంటున్నారు ఆర్థిక నిపుణులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Local News