P Ramesh, News18, Kakinada
సాధారణంగా సినీ నటులుగానీ, డైరక్టర్లు గానీ ప్రముఖ క్షేత్రాలను అప్పుడప్పుడు దర్శించుకుంటారు. అయితే వారి బిజీ షెడ్యూల్లో కూడా క్షేత్రాలను దర్శించుకుంటున్నారంటే దాని వెనుక ఏదొక అంతరార్థం ఉండనే ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లకు ఎక్కువగా సినీ ప్రముఖుల తాకిడి ఉంటుంది. ఇక్కడ ప్రాంతాల్లో ఉండే పర్యాటక ప్రాంతాల దగ్గర నుండి, గోదావరి అందాలు, కోనసీమ పచ్చదనం వంటివి ఎందరినో ఆకర్షిస్తాయి. ఇక క్షేత్రాల విశిష్టతకొస్తే చరిత్రకు నిలువుటద్దంలా ఉంటాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లా (Kakinada District) లో సామర్లకోట, ద్రాక్షారామం వంటి క్షేత్రాల్లో పంచారామాలు వెలిశాయి. పిఠాపురంలో అయితే ఏకంగా పాదగయ పుణ్యక్షేత్రం ఉంది. పురూహూతికా శక్తీ పీఠం కొలువైంది. దత్తాత్రేయ పుట్టిన ఊరుగా చెబుతుంటారు.
అందుకే ముఖ్యంగా ఇక్కడకు ఉత్తరాది రాష్ట్రాల నుండి కూ డా పెద్ద ఎత్తున వస్తుంటారు. ముఖ్యంగా సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందిన వారంతా ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ ఆలయాన్ని ప్రముఖ దర్శకులు హరీష్‌శంకర్, కొరటాల శివ, సానా బుచ్చిబాబులు దర్శించుకున్నారు. పిఠాపురానికి చెందిన డైరక్టర్ సానా బుచ్చిబాబు కోరిక మేరకు పిఠాపురంలో ఆలయాలను దర్శించుకున్నారు.
పాదగయ క్షేత్రంలో హోమ పూజలు చేసిన దర్శకులు ఉపాలయాలను సందర్శించారు. పురుహూతికా అమ్మవారికి పూజలు చేశారు. ఈసందర్భంగా దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ పిఠాపురంలో శ్రీపాద వల్లభుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ గురువైనటువంటి దర్శకుడు సుకుమార్ కూడా పిఠాపురం వస్తారన్నారు యువ దర్శకుడు బుచ్చిబాబు.
అయితే ఇంత సడెన్‌గా ముగ్గురు డైరక్టర్లు ఒకే క్షేత్రంలో పూజలు ఎందుకు చేసారనేది మాత్రం సస్పెన్స్. వారు తీసే సినిమాలు హిట్ అవ్వాలని కోరుకోవడం ఒక కారణమైతే. వారి ఎదుగుదులతో పాటు, సినీ పరిశ్రమలో మరింత పేరు గడించేందుకు దేవుళ్ల ఆశీస్సులు కావాలని కోరుకోవడం జరిగిందన్నారు దర్శకులు. ఇక కొరటాల శివ అయితే కుటుంబ సమేతంగా ఇదే క్షేత్రంలో హోమం చేశారు.
ఇక పిఠాపురానికి చెందిన యువ దర్శకుడు సానా బుచ్చిబాబు మాత్రం డైరక్టర్లు పిఠాపురంలో పూజలు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన కూడా భవిష్యత్తు ప్రణాళికపై నోరు మెదపలేదు. మొత్తం మీద ఈ ముగ్గురు డైరక్టర్లు పాదగయలో హోమం చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాబోవు కాలంలో వీరు తీసే సినిమాలకు ఈహోమానికి ఏమైనా సంబంధం ఉందా అనేది స్పష్టత రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News