(Ramesh, News18, East Godavari)
పులి ఈ మాట వింటేనే సగం వణికిపోతాం. ఇక దానిని చూస్తే మనకు చమటలే. ప్రస్తుతం ఈపులి మన్యం జిల్లాలను వణికిస్తోంది. ఏకంగా జనావాసాల మధ్య పులి ఆనవాళ్లు చూసి జనం బెంబెలెత్తుతున్నారు. సాధారణంగా పులుల సంఖ్య తగ్గుతుందని అంటున్నారు. కానీ చాలా పులులు ఇటీవల కాలంలో జనవాసాల మధ్యకు రావడం చూస్తుంటే ఆ లెక్క తప్పేమోననిపిస్తోంది. మొన్నటి వరకూ పులి పంజాతో తూర్పుగోదావరి జిల్లా వణికిపోయింది. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పులిసంచరిస్తుందన్న వార్తలతో అక్కడ జనానికి నిద్ర పట్టడం లేదు.
అల్లూరి జిల్లా రంపచోడవరం పరిధిలో ముసురుమిల్లి ప్రాంతంలో పులి హల్ చల్ చేస్తోంది. ఇక్కడ ప్రాంతంలో జనావసంలోకి పులివచ్చిందని అంటున్నారు. ముసురుమిల్లి ప్రాజెక్టు పరిధిలో ఉన్న సీతపల్లి ప్రాంతంలో పులి కాలిముద్రలు గుర్తించారు అటవీశాఖ అధికారులు. పులితోపాటు దాని పిల్ల కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ సూచన మేరకు అటువైపు రాకపోకలు నిషేధించారు. పులి ఆనవాళ్లు ఉండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ఇప్పటికే అటవీశాఖ అధికారులు అక్కడ ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కొద్ది నెలల క్రితం కాకినాడ జిల్లాలో పులి సంచారం కంటిమీద కునుకు లేకుండా చేస్తే తాజాగా రంపచోడవరం వద్ద పులి భయం పట్టుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా రెండు వారాల పాటు పులి తిరిగింది. ఇందుకు సంబంధించి ట్రాప్ కెమెరాలో కూడా పులి విజువల్స్ చిక్కాయి. ఇక్కడ ప్రాంతంలో రోజుకోక పాడి పశువును మింగేసింది. మేకలు, ఆవు దూడలు, గేదెలు ఇలా రోజుకొక దానిని ఆహారంగా తీసుకుంది. చివరకు దానికదే శంఖవరం తర్వాత ఉన్న ఏజెన్సీ ప్రాంతం ద్వారా మరలా అడవిలోకి చేరుకుంది. మొత్తం 15 రోజుల పాటు అటవీశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెట్టించింది పులి.
ప్రస్తుతం రంపచోడవరం సమీపంలోని సీతపల్లి వద్ద కొందరు ఈపులిని చూసారని చెప్పడంతో ఆనోట ఈనోట ఈ మాట దావనంలా వ్యాపించడంతో జనం భయపడిపోతున్నారు. దీంతోపాటు అక్కడ పులి తిరిగిన ప్రాంతంలో మట్టిలో పులి జాడలు స్పష్టం కనిపించాయి. వీటిని పరిశీలించిన అటవీశాఖ అధికారులు ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. మొత్తం మీద పులి సంచారం ఇప్పుడు ఏజెన్సీలో రాకపోకలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే రెండు రోజులుగా అక్కడ పులి సంచార భయంతో జనం బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News, Tiger