P Ramesh, News18, Kakinada
పులి పేరు చెబితేనే ఆ జిల్లా వణికిపోతుంది. ఇటీవల కాలంలో తరచుగా కాకినాడ జిల్లాలో పులి భయం జనాల్ని వెంటాడుతుంది. గత కొద్దికాలం కిందట కాకినాడ జిల్లాలో కత్తిపూడి, శంకవరం, గొల్లప్రోలు ప్రాంతాలను వణికించిన పులి చివరకు దాని దారిన అది పోయే వరకూ వారిని భయం వదల్లేదు. ముందుగానే అక్కడ గ్రామాల ప్రజలు అటవీశాఖ అధికారుల సహాయం తీసుకున్నారు. దీంతో పులి కోసం కెమెరాలను ఏర్పాటు చేసిన సమయంలో పులి కెమెరాల్లో చిక్కింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం చెందాయి. చివరకు దాని మార్గంలో అది మళ్లీ అడవిబాట పట్టిందని అటవీశాఖ అధికారులు నిర్థారించారు.
తాజాగా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి , శరభవరం గ్రామాల మధ్య సరుగుడు తోటలో గేదె మృతిపై భయాందోళన చెందుతున్నారు. రైతులు. అక్కడ సరుగుడు తోటలో గొర్రగేదె మృతదేహాన్ని చూసిన రైతులు ఇక్కడ ప్రాంతంలో పులి వచ్చిందన్న ప్రచారాన్నితెరపైకి తీసుకు రావడంతో అక్కడ శివారు గ్రామాల్లో వణుకు మొదలైంది. అయితే స్థానికంగా ఉన్న అధికారుల ద్వారా అటవీశాఖ అధికారులకు తెలిపారు గ్రామస్తులు. దీనిపై ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని అటవీశాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. రైతులు దూరం నుండి చూసింది పులా మరేదైనా జంతువా అనే కోణంలో అటవీశాఖ అధికారులు నిఘా ఉంచారు.
ప్రస్తుతం అక్కడ ప్రాంతంలో పులి ఉందన్న వార్తలు వ్యాపించడంతో జనం వణికిపోతున్నారు. రైతులు, గ్రామాల ప్రజలు ఆందోళన చెందొద్దని అటవీశాఖ అధికారుల భరోసా ఇస్తున్నారు. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతానికి అతిచేరువుగా ఉన్న ప్రాంతం కావడంతో ఏ జంతువు వచ్చినా పులి అనే ఆలోచనలో జనం ఉండటంతో అధికారులకు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువగా ఇక్కడ అటవీ ప్రాంతానికి సంబంధించిన జంతువులు సంచరించడం జరుగుతుంది.
గతంలో ప్రత్తిపాడు శివారు ప్రాంత వాసులు నేరుగా పులిని చూశారు. హైనా వంటి జంతువులు కూడా ఇక్కడ తిరగడం జరుగుతుంటాయి. ఇవి పాలిచ్చే గేదెలు, ఆవులపై దాడులు చేస్తుంటాయి. ఇక్కడ ప్రాంతం ఎక్కువగా సరుగుడు తోటలు ఉంటాయి. దుప్పెలు కూడా బయట ప్రాంతానికి రావడంతో బలమైన జంతువులు దుప్పెలపై దాడి చేస్తుంటాయి. ఆ తర్వాత జనం వీటిని చూసి పులి వచ్చిందని ఉహించుకోవడం కూడా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా పాడిగేదెలు చనిపోవడం కూడా చూస్తుంటే ఏ జంతువులు దాడి చేస్తున్నాయో అర్థం కావడం లేదని అంటున్నారు గ్రామస్తులు. మొత్తం మీద పులిని ఖచ్చితంగా చూసిన వారు తమకు తెలియజేయాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Local News, Tiger