P Ramesh, News18, Kakinada
సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే యువతలో ఎంతో మోజు. మొదట్లో జీతం తక్కువగా అనిపించినప్పటికీ ఎక్సపీరియెన్స్ పెరిగే కొద్ది ప్యాకేజీ కూడా పెరుగుతుంది. అందుకే ఈరోజుల్లో సాధారణ డిగ్రీ చదివిన వారు కూడా తక్కువ కాలంలో పూర్తయ్యే సాఫ్ట్ వేర్ కోర్సులు నేర్చుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఇలాగే ఓ కుర్రాడు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం పేరు చెప్పి ఇంట్లో వారు పెళ్లి చేసేశారు. అంతా అనుకున్నట్టుగానే జరిగింది. అయితే పెళ్లి అయిన కొన్ని రోజులకే ఉద్యోగంలో భారీగా జీతం పెరిగింది. ఇంకేముంది ప్రపంచాన్ని జయించినంత సంబరంతో పెళ్ళాంపై పెత్తనం చెలాయించడం ప్రారంభించాడు. కానీ భార్య మాత్రం మౌనదీక్షకు దిగింది. ఎందుకంటే తనకు జీతం పెరిగింది కాబట్టి కట్నం కూడా పెంచమన్నాడు. దీంతో ఆ భాగ్యురాలు అత్తింటి వద్ద పోరాటం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ విషయం మండపేటలో రచ్చరచ్చగా మారింది.
పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం తూర్పు గోదావరి జిల్లా (East Godavari) ప్రస్తుతం కోనసీమ జిల్లా ((Konaseema District) లో మండపేట మండలం ద్వారపూడి గ్రామానికి చెందిన లక్ష్మీ శైలజకు నామాల మోహన్ శ్యామ్‌తో రెండేళ్ల క్రితం వివాహమయ్యింది. ఆసమయంలో కట్న కానుకల కింద అరెకరం భూమి, రూ. 5 లక్షల ఆడపడచు కట్నం, 20 తులాల బంగారం ముట్టజెప్పారు. రెండేళ్లుగా వీరి కాపురం సజావుగానే సాగింది. ఇటీవల శ్యామ్ పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ వారు అతడికి జీతం పెంచారు. అయితే జీతం పెరిగింది కాబట్టి మా అబ్బాయికి ఇంకా ఎక్కువ కట్నం ఇవ్వాలంటూ లక్ష్మీ శైలజను అత్తమామలు వేధింపులకు గురిచేశారు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది.
తన భర్తతో కాపురం చేయనివ్వడం లేదని తన కాపురాన్ని నిలబెట్టాలని కోరుతోంది. ద్వారపూడి గ్రామంలో అత్తింటి వద్దే మౌన దీక్షకు దిగింది శైలజ. ఇంటి బయట కూర్చొని శైలజ దీక్షకు దిగడంతో ఇరుగుపొరుగు వారు నచ్చజెపుతున్నప్పటికీ ఫలితం లేకపోయింది. దీనిపై పోలీసులకు మాత్రం ఫిర్యాదు ఇవ్వలేదు. కేసు పెడితే సులువుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారని ఆరోపిస్తోంది బాధితురాలు లక్ష్మీశైలజ.
కావాలనే నిరసన: శైలజ మామ
తన కొడలు లక్ష్మీశైలజ కాపురం చేసింది చాలా తక్కువ అని, రోజూ ఇలా కావాలనే గొడవలు తెచ్చుకుంటుందని గట్టిగా ఏమైనా అంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని శ్యామ్ తండ్రి నామాల రంగారావు చెబుతున్నాడు. దీనిపై పోలీసులు విచారణ చేస్తే నిజనిజాలు బయటకొస్తాయని మేము అదనపు కట్నం ఆశించామని, దుష్ప్రచారం చేస్తోందని ఇది నిజం కాదని నామాల రంగారావు చెబుతున్నారు. మొత్తం మీద అదనపు కట్నం-కాపురం గొడవలు రచ్చకెక్కడంతో పాటు జీతం పెరిగిందని కట్నం అడిగాడన్న ప్రచారం ఇంటి గుట్టు వీధి పాలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.