P Ramesh, News18, Kakinada
మనిషికి అన్నింటి కన్నా ఆరోగ్యం ముఖ్యం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమంటారు పెద్దలు. అలాంటిది మనిషి ఆరోగ్యం పట్ల చాలా వరకూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడు. మనిషిపై ఉన్న బాధ్యతలో, లేక డబ్బులు సంపాదించాలన్న ఆశ, ఆతృత కలగలిపి ఆరోగ్యాన్ని దెబ్బతిస్తున్నాయి. తీరా ఆరోగ్యం చెడిపోయాక, అవే డబ్బులు దారాళంలా పోసినా కొన్ని సార్లు ఫలితం ఉండటం లేదు. వాస్తవానికి చెప్పాలంటే చిన్నపాటి జ్వరం వస్తే చాలు వేలకు వేలు ఫీజులతో కార్పోరేట్ ఆసుపత్రులు చుక్కలు చూపిస్తున్నాయి. ఆ పరీక్షలు, ఈపరీక్షలు చేయాలని వేలకు వేలు దోచేస్తున్నారు. నచ్చితే వైద్యం చేయించుకోవడం లేకపోతే అక్కడి నుండి వచ్చి ధర్మాసుపత్రులలో చేరడం తప్పితే ప్రశ్నించే నాథుడు లేడు.
అక్రమాలను అడ్డుకునే పాలకులు లేరు. ప్రస్తుతం సమాజం అట్లున్నది. ఇలాంటి ఈరోజుల్లో కూడా కేవలం 30 రూపాయలు చెల్లిస్తే చాలు అన్నిరకాల వైద్యం జరిగిపోతుందని అనుకోవడం కలే. కానీ తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) రాజమండ్రి (Rajahmundry) లో మాత్రం ఆకలను నిజం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కృషికి, సేవలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకు కేరాఫ్ అడ్రస్ గా మారింది రాజమండ్రిలోని రామకృష్ణా మిషన్ ధర్మ వైద్యశాల.
ధర్మవైద్యశాల సేవలు ఇవిగో..!
అక్కడకు ఉదయం వెళితే ఓపీ విభాగం ఉంటుంది. అక్కడ రూ.30 చెల్లించి పుస్తకం రాయించుకోవాలి. మనం చెప్పిన రోగ సమస్య ఆధారంగా , మనం ఏ డాక్టర్ను సంప్రదించాలనేది చెబుతారు. అక్కడి నుండి డాక్టర్ వద్దకు వెళ్లాలి. ఉచిత పరీక్షలు జరుగుతాయి. మందులు ఇస్తారు. ఎంత ఖరీదైన మందులైనా సరే అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మందులకు మాత్రం సగం ధర చెల్లించాలి. ఫిజియోథెరపీ చికిత్స దగ్గర నుండి పంటి సమస్యల వరకూ అన్ని అందుబాటులో ఉంచుతాయి. సాధారణ సేవలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. సర్జరీలకు సంబంధించిన సమస్యలకైతే మనకు నచ్చిన ఆసుప్రతికి సిఫార్సు చేస్తారు.
కిటకిటలాడే జనం
రాజమండ్రి మహానగరంగా అభివృద్ది చెందుతోంది. ఇక్కడ అన్ని రకాల కార్పోరేట్ ఆసుపత్రులు హంగులతో దర్శనమిస్తున్నాయి. ఉదయం లేస్తే ఏ ఆసుపత్రి ఖాళీ ఉండదు. అదే స్థాయిలో జనం జేబులకు చిల్లు పడుతోంది. ఇలాంటి నగరంలో కేవలం రూ.30 కి వైద్యం అంటే అది నిజంగా రాజమండ్రి వాసులకు, పరిసర ప్రాంత వాసులకు వరంగా మారింది. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పేద, మద్య తరగతి కుటుంబాలు ఈ ధర్మవైద్యశాల ద్వారా సేవలు పొందుతున్నారు. కేవలం మిషన్ ద్వారా వచ్చే నిధులతో ఇదంతా సాధ్యమవుతుందని రామకృష్ణా మిషన్ కార్యదర్శి తాతయ్య చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News, Rajahmundry