P Ramesh, News18, Kakinada
ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలు గతంతో పోలీస్తే కార్పోరేట్‌ను మించిన పని ఒత్తిడి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో పని చేశామా..జీతం తీసుకున్నామా అనేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు లోకం మారింది. ప్రభుత్వ ఉద్యోగం అంటే అదొక ప్రహసనమే. అంతా ఆన్ లైన్, ఎక్కడ ఉంటున్నాం. ఏం చేస్తున్నామనేది ఖచ్చితంగా తెలియాల్సిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైతే ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఫేస్ రికగ్నిజేషన్ యాప్ కూడా తీసుకొచ్చింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ ఉద్యోగులు తీరిక సమయాల్లో ఏదొక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చూస్తుంటాం. కొందరైతే సమాజ సేవనే పరమావధిగా చూస్తుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే సంఘటన చూస్తే నిజంగా అవాక్కవ్వాల్సిందే. వారిద్దరూ కలెక్టర్లు, పైగా దంపతులు ఇలాంటి అన్యోన్య దంపతులు తీరిక సమాయాల్లో చేస్తున్న పనికి అంతా శభాష్ అంటున్నారు.
సాధారణంగా జిల్లా కలెక్టర్ అంటే క్షణం కూడా తీరిక ఉండదు. నిత్యం ప్రజా సమస్యలు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారు జిల్లా మొత్తాన్ని నడిపించాలి. అయితే కేవలం పరిపాలనే కాదు, సేవలోనూ ముందుంటా మంటున్నారు కలెక్టర్ దంపతులు. కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా , కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇద్దరు దంపతులు. క్షణం ఖాళీ లేకుండా గడిపే వీరు, పేదలకు సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందుంటున్నారు.
ఇటీవల పేదలకు ప్రభుత్వం ద్వారా తక్షణం అందే సహాయం అందించడంతోపాటు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలలో పాల్గొంటున్నారు. మరోపక్క నిరుపేదలకు దుస్తులు, విద్యార్థులకు పుస్తకాలను కూడా అందిస్తూ సేవా గుణాన్ని చాటుతున్నారు. ఇదే సమయంలో వారు పేదల సమస్యల పట్ల స్పందిస్తున్న తీరును పలువురు అభినందిస్తున్నారు. కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రభుత్వ పాఠశాలలలోనే చదివారట. అందుకే ఆయనకు పేదరికం ఇబ్బందులపై ఎప్పుడూ ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడానికి ఆయన ఎదుర్కొన్న పరిస్థితులే కారణమట. అందుకే ఇటీవల కాలంలో కాకినాడలో ఓ పాఠశాలలో పూర్వ విద్యార్థులు చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు తన చిన్నతనం గుర్తులను పంచుకున్నారు.ఇక ఆయన భార్య కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అయితే సేవా గుణంలో ఆమెకు సాటిరారంటున్నారు పలువురు.
దీనికి కారణం ఆమె కార్యాలయంలో ఉన్నప్పుడు దివ్యాంగులు గాని, మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు వెళితే తక్షణ సాయం చేయడానికి దాదాపుగా ప్రయత్నిస్తారట. ఆమె చేతిలో లేని పనులను కూడా చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపి సంబంధిత వ్యక్తులకు సాయం చేయడానికి కృషి చేస్తారట. ఇటీవల కొంత మంది దివ్యాంగులకు రిక్షాలు ఇప్పించడం, పలువురుకి విద్యలో సహకారం చేయడం ఆమె సేవా గణానికి ఉదాహరణగా చెబుతున్నారు. భార్యాభర్తలు కావడం ఇద్దరు కలెక్టర్లు కావడం అందులోనూ పక్క పక్క జిల్లాల్లో పనిచేయడం వీరికి బాగా కలిసొచ్చింది. అందుకే తీరిక సమయాల్లో ఈదంపతులిద్దరూ సేవా కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News