(Ramesh, News18, East Godavari)
రైతు దేశానికి వెన్నెముక. రైతు లేనిదే మనం లేము. ఇవన్ని నేతల నోట నిత్యం పలికే కమ్మని పలుకులు. కానీ వాస్తవంలో రైతు కష్టం చూస్తే సామాన్యుడికి కన్నీళ్లు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కారణం ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలే అన్నది ప్రధాన కారణం. వాస్తవానికి ప్రభుత్వాలు రైతులకు మేలు చేస్తున్నాయన్నది మాత్రం కాగితాలకే పరిమితంగా మారింది ప్రస్తుత పరిస్థితి. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతు దుస్థితి మాత్రం మారడం లేదు. ఇందుక కారణాలేంటుకుంటున్నారా..అందులో కొన్ని మీరే చూడండి
రైతులకు కొద్దిగా భూమి ఉంటే ఆభూమిని కౌలుకు ఇస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఉండే రైతుకు కౌలు రైతు శిస్తు చెల్లిస్తున్నాడు. ఇక్కడ వరకూ కొద్దిగా ఫలసాయాన్ని అసలు రైతు దక్కించుకుంటున్నాడు. అదే పంటకు రావాల్సిన ప్రభుత్వ సబ్సిడీలు, నష్టపరిహారం, ఇతరేత్రా లబ్ధి మొత్తం అసలు రైతుకే చేరుతుంది. ఇక్కడ భూమి ఉన్న ఒకే ఒక కారణంతో భూమి హక్కు గల రైతుకు లబ్ధి రెండింతలు వస్తోంది. మరోపక్క కౌలు రైతుకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. క్షేత్రస్థాయిలో కౌలు రైతుదే కష్టమంతా. ఒక పక్క పెట్టుబడి, మరోపక్క తుఫానులు, వరదలు, ఇతర వాతావరణ కారణాలతో పంట నష్టం వస్తే భరించాల్సింది కౌలు రైతే. ఇక భూమి కౌలుకు తీసుకున్నందుకు శిస్తు ఏలాగూ చెల్లించక తప్పదు. ఈవిధానంపై గతంలో ప్రభుత్వాలు స్పందించి మరలా వదిలేశాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు కనీసం స్పందించడం లేదు.
ఈక్రాప్ లేకుంటే కష్టం
ఏపీలో ఈ-క్రాప్ ద్వారా ఆన్లైన్లో రైతు పండించే పంట వివరాలు నమోదు చేయాలి. వాస్తవానికి భూమి హక్కు గల ఆధారాలన్ని అసలు రైతు దగ్గర ఉంటాయి. పంట పండించే కౌలు రైతు ద్వారా ఈ-క్రాప్ నమోదు కాదు. దీనికి కారణం అసలు రైతు, కౌలు రైతుకు ఎటువంటి అంగీకారం ఇవ్వడం లేదు. కేవలం మాట మీద మాత్రమే కౌలు సాగిపోతుంది. పంట కౌలు రైతు పండిస్తే, ఈ-క్రాప్ మాత్రం భూమి హక్కు గల రైతు పేరున నమోదవుతుంది. అయితే ధాన్యం అమ్మాల్సింది మాత్రం కౌలు రైతు. ఈ-క్రాప్ పత్రాలు మాత్రం అసలు రైతు పేరున ఉంటాయి. వాటిని కౌలు రైతుకు ఇచ్చేందుకు అసలు రైతు ఒప్పుకోవడం లేదు. అయితే ఈ-క్రాప్ వివరాలు ఇవ్వకపోతే ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా తీసుకోవాల్సిన ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. ఇలా ప్రతీసారి జరగడంతో కౌలు రైతులకు పండించిన ధాన్యాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
మిల్లర్లు మాయాజాలం
కౌలు రైతులు ధాన్యం అమ్మలేక పడుతున్న ఇబ్బందులు మిల్లర్లకు కలిసొస్తోంది. అందుకే ఏకంగా బస్తాకు రూ.280 వరకూ కమిషన్ ధర తగ్గించుకుంటున్నారు. దీంతో ఒక్క బస్తా దగ్గర 280 రూపాయాలు కోల్పోవాల్సి వస్తుంది. దీనికి తోడు తేమశాతం తగ్గింపు, గోనెసంచులు, కూలీలు, రవాణా వీటన్నింటిని కౌలు రైతే భరించాలి. వాస్తవానికి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పెట్టిన తేమ నిబంధనలే పెద్ద తలనొప్పి అనుకుంటే, కౌలు రైతుల నుండి కొనుగోలును ఈ-క్రాప్‌కు ముడిపెట్టడం పెద్ద సమస్యగా మారింది. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే కౌలు రైతులు పండించిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి.కౌలు రైతులు ధాన్యం అమ్మలేక పడుతున్న ఇబ్బందులు మిల్లర్లకు కలిసొస్తోంది. అందుకే ఏకంగా బస్తాకు రూ.280 వరకూ కమిషన్ ధర తగ్గించుకుంటున్నారు. దీంతో ఒక్క బస్తా దగ్గర 280 రూపాయాలు కోల్పోవాల్సి వస్తుంది. దీనికి తోడు తేమశాతం తగ్గింపు, గోనెసంచులు, కూలీలు, రవాణా వీటన్నింటిని కౌలు రైతే భరించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News