TDP Mahanadu: 2024 ఎన్నికలను తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఫిక్స్ అయ్యారు. అందుకే డూ ఆర్ డై తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా వచ్చే ఎన్నికలకు సమర సన్నాహకంగా మహానాడు (Mahanadu) ను భావిస్తున్నారు. రేపటి నుంచి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో ఈ టీడీపీ (TDP) మహానాడు నిర్వహించనున్నారు. ఇప్పటికే రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం రండీ అంటూ చంద్రబాబు డిజిటల్ సంతకాలతో ఆహ్వానాలను పంపించారు కూడా. శని, ఆదివారాల్లో మహానాడును ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహానాడు కార్యక్రమంలో భాగంగా తొలిరోజు ప్రతినిధుల సభ, 28న మహానాడు భారీ బహిరంగ సభ జరగనుంది. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ ప్రతినిధుల మహానాడును మే 27న జరుపుకోవటం టీడీపీ సంప్రదాయం.
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటిచెప్పారని చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు నాంది పలికారని కీర్తించారు. మహానాడు వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి (మే 28) రోజు మహానాడు జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందని వెల్లడించారు. రాజమండ్రి మహానాడులో అన్ని అంశాలపై చర్చలు ఉంటాయని..రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక నిర్ణయాలపై చర్చ చేపడతామని పేర్కొన్నారు. మే 28న భారీ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. కాగా.. ఈ సమావేశాలకు 15 లక్షల మందికి పైగా వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో, మహానాడు ప్రతినిధుల సభకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన డిజిటల్ సంతకంతో ఆహ్వానాలు పంపుతున్నారు. మరోవైపు మహానాడు వేదికగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో (Manifesto)ప్రాథమిక అంశాలు వెల్లడించనున్నారు చంద్రబాబు నాయుడు.
ముఖ్యంగా మహిళలు, రైతులు, యువతకు అధిక ప్రయోజనం చేకూర్చేలా తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టో ఉండనుందని తెలుస్తోంది. అయితే మేనిఫెస్టోలో ముఖ్య అంశాలను మాత్రమే చెప్పనున్నారు. అలాగే దసరా నాటికి పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. మహానాడులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే చంద్రబాబు, లోకేశ్ చేరుకోనున్నారు. మొదట చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతోన్న వేళ ఈ సారి మరింత ప్రతిష్టాతక్మంగా మహానాడును నిర్వహిస్తున్నారు. దాదాపు 25 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఏపీకి సంబంధించిన 15, తెలంగాణకు సంబంధించిన 6 తీర్మానాలు ప్రవేశపెడతారు. నాలుగు ఉమ్మడి తీర్మానాలు ఉండనున్నాయని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, AP News, Chandrababu Naidu, Local News, TDP