హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ లో అదరగొడుతున్న స్వీపర్.. పిల్లలు మాట్లాడుతుంటే విని నేర్చుకుంది

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ లో అదరగొడుతున్న స్వీపర్.. పిల్లలు మాట్లాడుతుంటే విని నేర్చుకుంది

ఇంగ్లిష్

ఇంగ్లిష్ లో అదరగొడుతున్న మహిళ

ఇంగ్లిష్ మీడియం (English Medium) కు ప్రాధాన్యత పెరగడంతో సర్కార్ బడుల్లోని విద్యా్ర్థులు కూడా ఇంగ్లిష్ లో దంచికొడుతున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అందరిని అబ్బురపరిచింది.

 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India

  P. Ramesh, News18, Kakinada

  ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ‌లోని ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మారిపోయాయి. ఇంగ్లిష్ మీడియంకు ప్రాధాన్యత పెరగడంతో సర్కార్ బడుల్లోని విద్యా్ర్థులు కూడా ఇంగ్లిష్ లో దంచికొడుతున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అందరిని అబ్బురపరిచింది. కాకినాడ జిల్లా (Kakinada District) లోని తొండంగి మండ‌లం రావికంపాడు గ్రామంలో ఉన్న జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్‌లో చిన్ని అనే మహిళ ఆయాగా పనిచేస్తుంది. ఆ పాఠ‌శాల‌లో చీపురు ప‌ట్టుకుని త‌ర‌గ‌తి గ‌దులు తుడిచి శుభ్రం చేస్తుంది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.., వాళ్లు స్కూల్‌కు వచ్చే లోపే స్కూల్‌ అంతా నీట్‌గా క్లీన్‌ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె స్కూల్‌నే కాదు..ప్రభుత్వ పాఠశాలలను చులకనగా చూసేవారి బుద్దిని కూడా శుభ్రం చేస్తోంది.

  ఆమె ఇప్పుడు ఆ పాఠ‌శాల‌కే కాదు, ఆ ఊరికే గుర్తింపు తీసుకొచ్చింది. చిన్ని చ‌దివింది మూడ‌వ త‌ర‌గ‌తి కానీ, ఆమె ఇంగ్లీషులో మాట్లాడుతుంటే అక్కడంతా అవాక్కవుతున్నారు. సాధార‌ణంగా చ‌దువుకున్న వారు కూడా ఈ రోజుల్లో ఇంగ్లీషు కోసం త‌పన పడుతుంటే ఆమె మాత్రం ఇంగ్లీషులో త‌న వివ‌రాల‌ను చెప్పడం చూసి పాఠ‌శాల‌లో ఉపాధ్యాయులే ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ చిన్ని ఇంగ్లిష్ ఎక్కడ నేర్చుకుందో తెలిస్తే షాక్ అవుతారు. ప్రతీరోజు క్లాస్ రూమ్ లు తుడిచే స‌మ‌యంలో, పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడుతున్న మాట‌లు విని చిన్ని ఇంగ్లీష్ నేర్చుకుంది.

  ఇది చదవండి: ప్రభుత్వ ఉద్యోగమున్నా డోంట్ కేర్.. సొంత సెలూన్ ఉంటేనే పిల్లనిస్తారట..!

  ఆమె స‌ర‌దాగా ఒక రోజు పిల్లల‌తో ఇంగ్లీషు మాట్లాడింది. ఇది చూసిన పాఠ‌శాల‌లోని ఇంగ్లీషు టీచ‌ర్ ఆమె చూపిస్తున్న ఆస‌క్తిని గ‌మ‌నించి పిల్లల‌తో పాటు ఆమెకు ఇంగ్లీషు నేర్పడం మొద‌లుపెట్టారు. మ‌నం రోజు చేసే ప‌నుల‌ను ఆమె ఇంగ్లీషులో చెప్పడం, చిన్న చిన్న పదాల‌ను చెప్పడం ప్రారంభించింది. దీంతో ఆమె మాట్లాడుతున్న వీడియోల‌ను తీసి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు స్థానిక యువత. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంపై చిన్ని మాటల్లో.., “చిన్నపాటి ప‌దాలు నేర్చుకున్న నేను, మాస్టార్లు క్లాస్ రూమ్స్‌లో చెప్పిన‌ప్పుడు విన‌డం ప్రారంభించాను. ప‌దాల‌ను వాఖ్యాలుగా మొదలు పెట్టాను. దాదాపుగా రోజు చేసే ప‌నుల‌న్నింటిని ఇంగ్లీషులో చెప్పగ‌లుగుతున్నాను” అని చెప్పింది.

  ఇది చదవండి: ఆ కొండపైన రాయి కాదు కదా పూచికపుల్ల పట్టుకోవాలన్నా వణికిపోతారు..! కారణం ఇదే..!

  ఇంగ్లీష్ ‌లో పిల్లలతో మాట్లాడుతుంటే చాలా సరదాగా ఉందని చిన్ని చెబుతోంది. భాష నేర్చుకోవడానికి వయస్సు, వృత్తితో సంబంధం లేదని నిరూపిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచిన చిన్నిని స్కూల్‌ ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. చిన్నితో స్కూల్‌లోని విద్యార్థులంతా ఇంగ్లీష్ ‌లోనే మాట్లాడతారు. తనకు అర్థమైనంతవరకు వాళ్లకు ఇంగ్లీష్ ‌లోనే బదులిస్తుంది. ఒకవేళ ఏదైనా అర్థంకాకపోతే దాని అర్థం అడిగి మరి తెలుసుకుంటుంది. ఈ ఒక్క సంఘటన చాలు రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ధీటుగా ఇంగ్లీష్ మాట్లాడతారు అని చెప్పటానికి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East godavari, Local News

  ఉత్తమ కథలు