P Ramesh, News18, Kakinada
అంతర్వేది లక్ష్మినరసింహాస్వామి (Antharvdi Laxminarasimha swamy Temple) అంటే చాలు కోనసీమ జిల్లాతోపాటు, ఉమ్మడి తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలకు ఇష్టమైన దైవం. మాఘ మాసంలో ఈ క్షేత్రాన్ని దర్శిస్తే చాలు సకల పాపాలు పోతాయనేది భక్తుల నమ్మకం. అందుకే మాఘమాసంలో జరిగే స్వామి వారి తీర్థమహోత్సవాలకు అంతటి పేరుంటుంది. ఇక్కడ స్వామివారి రథోత్సవం అనంతరం సముద్రంలో చక్రస్నానం చేయిస్తారు. చక్రస్నానం చేయించే సమయంలో స్వామిని ఎత్తుకుని తీసుకెళ్లి ఆయన్ను సముద్రంలో ముంచేందుకు జనం పోటిపడతారు. అయితే ఈ చక్రస్నానం వెనుక అసలు రహస్యం తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.
మాఘ పౌర్ణమినాడు జరిగే అంతర్వేది సముద్రతీరం భక్తజనసందోహంతో నిండిపోయింది. తెల్లవారు జాము నుంచే భక్తులు సముద్ర స్నానాలు ఆచరించేందుకు ఎగబడ్డారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువై ఉన్న దేవ దేవుడు శ్రీ లక్ష్మీ నారశింహుని కళ్యాణ మహోత్సవాలు ఆఖరి దశకు చేరుకున్నాయి. స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గరుడ పుష్పక వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం అనంతరం చక్రస్నానాన్ని నిర్వహించారు.
అంతర్వేదిపాలెం వాస్తవ్యులు శ్రీమతి రుద్రరాజు బంగారమ్మ గారిచే నిర్మించబడిన గరుడ పుష్పక వాహనంపై స్వామి వారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చి వేద పండితులు కళ్యాణ మూర్తులకు అవబృదోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదమంత్రోచ్చారణలు, గోవిందా గోవిందా గోవిందా నామస్మరణల మధ్య స్వామి వారిని (సముద్ర) చక్రవారిస్నానం జరిపించారు. గోవిందా గోవిందా గోవిందా నామస్మరణతో అంతర్వేది మార్మోగిపోయింది. నదులలో 12 సంవత్సరాలకి ఒకసారి పుష్కర స్నానాలు వస్తాయని, స్వామి వారి కళ్యాణం అనంతరం స్వామి వారు స్నానమాచరించిన ప్రదేశం ప్రతి ఏటా పుష్కర పుణ్య ఫలం దక్కుతుందనే ఆచారంతో భక్తులు వేలాదిగా స్నానాలు ఆచరించారు.
అంతర్వేది లక్ష్మి నరసింహస్వామిని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. మాఘ మాసంలో స్వామివారి ఉత్సవాల సందడి వారం రోజుల పాటు ఉంటుంది. సుదూర ప్రాంతాల నుండి భక్తులకు స్థానికంగా ఏర్పాట్లు ఉంటాయి. లక్ష్మినరసింహస్వామిని దర్శించుకునే ముందు ఆలయానికి దగ్గర్లో ఉన్న సముద్రస్నానం చేసి స్వామిని దర్శించుకోవాలి. కొంత మంది ఉపవాస దీక్షలు కూడా చేస్తారు. ఎక్కువగా యువత లక్ష్మినరసింహ స్వామి అనుగ్రహం కోసం దూరప్రాంతాల నుండి రావడం జరుగుతూ ఉంటుంది. మాఘ మాసంలో జరిగే ఉత్సవాల్లో రథోత్సవం ప్రత్యేకంగా చెప్పదగ్గది. వేలాది భక్తులు రథాన్ని ముందుకు తీసుకెళ్తారు. పెద్ద ఎత్తున బాణా సంచా కాల్పులు ఉంటాయి. కోనసీమ రుచులన్ని ఇక్కడ నిర్వహించే జాతరలో అందుబాటులో ఉంచుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.