P Ramesh, News18, Kakinada
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) లో జరుగుతున్న ఘర్షణలు చూస్తుంటే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సాధారణంగా ఇక్కడ ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల స్థల వివాదాలు వంటివి సాధారణం. పండగ సీజన్‌లో పాత కక్షలు కూడా బయట పడుతుంటాయి. గొప్పల కోసం కత్తులు పట్టుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. కేసులకు భయపడకపోవడం, గ్రామాల్లో యువతను ఘర్షణలకు పోత్రహించడం వెనుక పొలిటికల్ గేమ్ ఉంటుంది. ఒకపక్క గొడవలు పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ వారి హెచ్చరికలను పక్కన పెట్టయడం,ఘర్షణల వెనుక రాజకీయ కక్షలు ఉండటంతో పండగ సీజన్‌లో ప్రతిసారి ఇక్కడ గొడవలు షరా మాములయిపోతాయి. అయితే కొన్ని చోట్ల ఈ ఏడాది గుండాట, పేకాట వంటి ఆటలు ఆడలేదని కూడా గొడవలు పడటం కనిపించింది.
ఇటీవల కాలంలో జరిగిన ఓ గొడవ ఏకంగా ఒక పార్టీలో రెండు వర్గాల మధ్య యుద్దానికి తెరతీసింది. దీంతో పోలీసులు ఈవ్యవహారంలో ఏం చేయాలో తెలియ తలలు పట్టుకుంటున్నారు. పైగా అక్కడ ప్రత్యేకంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా (Kakinada District) లోని గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో సర్పంచి-ఉపసర్పంచి వర్గీయుల మధ్య వార్ నడుస్తోంది.
ఇది కాస్తా సంక్రాంతికి జూదం ఆడించలేదన్న నెపాన్ని ఒకరిపై ఒకరు మోపుకున్నారు. సర్పంచి కందా సుబ్రహ్మాణ్యం, ఉప సర్పంచి కందా చినబాబులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటీవల సంక్రాంతి పండగ మూడు రోజులుపాటు గ్రామంలో కోడిపందాలు, గుండాట ఆడించడంలో తమదే పై చేయి అంటే తమదే పైచేయి అని బీరాలు పలికారు. దీంతో పోలీసులు ఇద్దరికి అనుమతి నిరాకరించారు.
గ్రామంలో జూదాలు నిలిచిపోయాయి. అయితే జూదాలు నిలిచిపోవడానికి ఉపసర్పంచి కందా చినబాబే కారణమని సర్పంచి సుబ్రహ్మాణ్యం వర్గం ఆరోపించింది. ఈనేపథ్యంలో ఉపసర్పంచి చినబాబుపై సర్పంచి వర్గానికి చెందిన కందా చక్రధర్ కత్తితో దాడిచేసి గాయపరిచాడు. ఈ సమయంలో ఉపసర్పంచి కుమారడు శ్రీరామ్మూర్తికి గాయాలయ్యాయి. ఈ వివాదంలో ఉపసర్పంచి వర్గీయులు కూడా సర్పంచి వర్గంపై దాడికి పాల్పడటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు.
గాయపడ్డ ఉపసర్పంచి, అతడి కుమారుడికి పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించారు. ఇరు వర్గాలపైనా కోట్లాట కేసు నమోదు చేశారు. ఘర్షణ వాతావరణం దృష్ట్యా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు పిఠాపురం సర్కిల్ ఇన్స్ పెక్టర్ వైఆర్‌కే శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా ఇద్దరు కూడా వైసీపీ పార్టీకి చెందిన వారు కావడంతో గ్రామంలో ఒకే పార్టీ నుండి రెండు వర్గాలుగా విడిపోయి, వ్యక్తిగత కక్షలు పెంచుకోవడంతో అక్కడ వైసీపీ తీరు సందిగ్ఢంలో పడింది. దీనిపై అధికార పార్టీ నేతలు కూడా ఏం చేయాలన్న దానిపై పునరాలోచనలో పడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News