P Ramesh, News18, Kakinada
ఇటీవల కాలంలో నేర సంఘటనలు చూస్తుంటే సినిమా డైరక్టర్లకు కొత్త ఆలోచనలు వచ్చేటట్లుగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం క్రైమ్ జరిగే తీరు మారిపోయింది. దొంగతనం గాని, మరే ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేసే వారికొస్తున్న ఆలోచనలు చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. ఒకప్పుడు దొంగతనాలు కేవలం రాత్రిళ్లే జరిగేవి. కానీ ఇప్పుడు రాత్రి-పగలు లేకుండా దోచుకుపోవడమే లక్ష్యంగా ఉంది. నేరప్రవృతి గల వారికే ఇటువంటి ఆలోచనలు వస్తాయనేది ఒకప్పటి మాట. ఇప్పుడు సినిమాల ప్రభావం, సీరియల్స్ ప్రభావంతో దొంగతనాలు సులువుగా చేస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో విలువలకు అవకాశం లేకుండా పోతుంది. నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం.. సమాజం.. బంధువులు ఇలా తారతమ్యాలు లేకుండా నేరాలకు పాల్పడుతున్నారు.
తాజాగా కోనసీమ జిల్లా (Konaseema District) లో ఇంట్లో టీవి చూస్తున్న ఇద్దరు మహిళలకు కూల్ డ్రింక్ లో మత్తు మందిచ్చి బంగారం దోచుకుపోయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎవరూ ఉహించని ఈ ఘటన ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామంలోని కాళేవారి వీధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు చూస్తే ఈ ఘటన ఆశ్చర్యపోయే విధంగా ఉంది. కాళేవారి వీధిలో నివాసముంటున్న కాళేమణి కమలావతి, చింతలపూడి గోగులమ్మ ఇంట్లో టివి చూస్తున్నారు. అదే సమయంలో దగ్గర బంధువులు ఇద్దరు వచ్చారు. మాటలో మాట కలిపారు. వెంటనే కూల్ డ్రింక్ తెప్పించి కమలావతి, గోగులమ్మకు తాగించారు. తాగిన కొద్దిసేపటికే వారు అపాస్మారక స్థితికి చేరుకున్నారు. ఇదే సమయంలో ఇంట్లో బంగారం, వారికున్న చెవి దిద్దులు, పుస్తెల తాడు, పదివేల నగదు దోచుకుపోయారు.
ఉదయం ఎంతకీ వీరిద్దరు బయటకు రాకపోవడంతో పక్కింటి వారు వెళ్లి చూడగా , మంచంపైనే ఇద్దరు మత్తులో ఉన్నారు. ఇంటి తలుపులు తెరచి ఉన్నాయి. ఇంట్లో వస్తువులు కూడా చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో దొంగతనం జరిగిందని నిర్థారణకు వచ్చిన ఇరుగుపొరుగు వారు.. బంధువులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. మత్తులో ఉన్న కమలావతి, గోగులమ్మలను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఐ.పోలవరం ఎస్సై రాజేష్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. కమలావతి బంధువులే ఈ చోరికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.