(Ramesh, News18, East Godavari)
తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత స్థానంలో ఎవరైనా నాయకుడు పేరు చెబితే టక్కున అందరి నోట వినిపించే మాట యనమల రామకృష్ణుడు. వాస్తవానికి రామకృష్ణుడు మొదట వృత్తి రీత్యా న్యాయవాది. అప్పట్లో తుని నియోజకవర్గంలో బీసీ నుండి మంచి వ్యక్తి పోటీకి అవసరం. తెలుగుదేశంలో ఎన్.టి.రామారావు దృష్టిలో పడ్డ యనమల రామకృష్ణుడు , తనకు వరుస తమ్ముడైనటువంటి యనమల కృష్ణుడుని{: ఆధారంగా చేసుకుని రాజకీయంగా ఓ వెలుగు వెలిగాడు.
ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్‌గా ఇలా రాజకీయ రంగంలో నేటి వరకూ తనకు తిరుగులేని ముద్ర వేసుకున్నారు రామకృష్ణుడు. అయితే ఎన్ టి రామారావు ముఖ్యమంత్రిగా దిగిపోవడానికి ముఖ్య కారణం. అప్పట్లో రామకృష్ణుడు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకున్న అనూహ్యమైన నిర్ణయమే కారణమని నేటికి ఆయనపై మరక అలానే ఉండిపోయింది. తనకు రాజకీయంగా అవకాశం కల్పించింది ఎన్.టి.ఆర్ అయినప్పటికీ ఎక్కువగా చంద్రబాబుతో ఉన్న రామకృష్ణుడికి ఉన్న సంబంధాలే ప్రధానంగా ఆయన ఎదుగుదలకు దోహదం చేశాయని అంటుంటారు.
సీన్ కట్ చేస్తే మొత్తం మీద ప్రస్తుతం కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గంలో యనమల సోదరులు రాజకీయంగా దూసుకెళ్లారు. కానీ అనూహ్యంగా 2014లో యనమల కృష్ణుడికి టిక్కెట్టు ఇప్పించినప్పటికీ ఫలితం దక్కలేదు. అదే పరాభవం 2019లో ఎదురవడంతో కృష్ణుడికి ఎమ్మెల్యే అవ్వాలన్న ఆశ ఉన్నప్పటికీ కోరిక మాత్రం తీరలేదు. అక్కడ వైసీపీ నుండి మంత్రి దాడిశెట్టి రాజా ముందంజలో ఉన్నారు. ఇందుకు కారణం అన్న రామకృష్ణుడి అండతోకృష్ణుడు నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేఖ విధానాలను అవలంభించారనే ఆరోపణలుఎదుర్కొంటున్నాడు..
అయితే తమ్ముడి తర్వాత ఏదైనా అని చెప్పే రామకృష్ణుడు.. ఏకంగా ఈసారి తమ్ముడిని ఇన్‌ఛార్జి బాధ్యతల నుండి తప్పించారు.రామకృష్ణుడకుమార్తె యనమల దివ్యకు టిడిపి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించడం ప్రస్తుతం నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు కంగుతిన్నారు. కొద్ది నెలల నుండి యనమల దివ్య పేరు తెరపైకి వస్తోంది. అయితే 40 ఏళ్ల పొలిటికల్ కెరియర్‌లో రామకృష్ణుడు తనకు అన్యాయం చేయడనే గట్టి నమ్మకంతో ఉన్న తమ్ముడు కృష్ణుడు దివ్య వస్తోందన్న ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఇటీవల కార్యకర్తల సమావేశంలో ఎవరేమనుకున్నా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న రామకృష్ణుడి మాటలతో అందరూ గుంభనంగా ఉండిపోవాల్సి వచ్చింది. తీరా చూస్తే ఇది జరిగి నెల రోజులు గడవక ముందే రామకృష్ణుడు కుమార్తె దివ్య తెరపైకి వచ్చి పగ్గాలు పట్టుకోవాల్సి వచ్చింది. ఈవిషయంలో యనమల రామకృష్ణుడి అల్లుడి నుండి బాగా ఒత్తిడి ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన అల్లుడు ఇన్‌కమ్ టాక్స్ అధికారిగా ఉన్నారు.
రాజకీయంగా తండ్రి బాటలో నడవాలని దివ్య కూడా నిర్ణయించుకోవడంతో ఈ ప్రభావం ఆమె చిన్నాన అయిన యనమల కృష్ణుడికి తగిలింది. దీంతో పాటు తుని నియోజవకర్గంలో యనమల కృష్ణుడు పోటి చేస్తే మరోసారి ఓటమి తప్పదన్న సర్వే నివేదికలు సిద్దమయ్యాయి. చేసేది లేక దివ్య పేరును ఖరారు చేసింది అధిష్టానం. అయితే దివ్య రాకపై కృష్ణుడి వర్గం కుతకుతలాడుతోంది.కానీ ఇప్పుడిప్పుడు ఏం చేయలేని సందిగ్ధ సంకట స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది.
ఇక చేసేది లేక త్వరలో చంద్రబాబు జిల్లా పర్యటనలో తమ వాదన వినిపిస్తామని టిక్కెట్టు తనకే ఇవ్వాలని అడుగుతామని స్వరం వినిపిస్తున్నారు కృష్ణుడు. మొత్తం మీద తుని టిడిపి టిక్కెట్టు వ్యవహారంలో దాదాపు దివ్య పేరు ఖరారైనప్పటికీ ఆమె చిన్నాన కృష్ణుడు మాత్రం పోరాటం తప్పదంటున్నాడు. ఇన్‌ఛార్జి ఇచ్చినంత మాత్రానా టిక్కెట్టు ఇచ్చినట్టు కాదని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు. మొత్తం మీద యనమల కుటుంబంలో రేగిన ఈచిచ్చు ఆరుతుందా..లేక యుద్దం దిశగా అడుగులేస్తోందా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News