Ramesh, News18, East Godavari
ఏపీలో ప్రభుత్వ పథకాల జాతర జరుగుతోంది. నవ రత్నాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడుగులు వేస్తుంటే, మరోపక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కలయికతో మరికొన్ని పథకాలు తెరపైకి వస్తున్నాయి. ఇలా పథకాల పంట పండిస్తున్నారు. అయితే లబ్దిదారుల ఎంపికలో మాత్రం కాస్త అటూ ఇటూగా ఆలోచిస్తున్నారు అధికారులు. అదేంటి అంటారా అక్కడే ఉంది అసలు కిటుకు.
జగన్ పై ఎన్ని మరకలు ఉన్నప్పటికీ ఆయన సర్కార్లో మాత్రం పథకాలు చాలా టాన్స్ప్రెంట్గా అందుతున్నాయన్నది నేతల మాట. ఇందుకోసం జగన్ ఎంపిక చేసుకున్న వాలంటీర్లు, ఆయన హయాంలో నెలకొన్న గ్రామ, వార్డు సచివాలయాలే కొలమానంగా చెబుతున్నారు. వలంటీర్ ద్వారా సచివాలయానికి ఓ దరఖాస్తు పడేస్తే చాలు, అర్హత ఉంటే పథకం వెతుక్కుంటూ గుమ్మం తొక్కుతుందన్నది జగన్ మాట. అయితే కొన్ని పథకాలు మాత్రం ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అందులో ముఖ్యంగా ఇళ్ల స్థలాల ఎంపికలో తొలుత పారదర్శకత చూపినప్పటికీ రీ-సర్వేల పేరుతో అయిన వారికే అప్పగించారన్న వాదనలు బలంగా వినిపించాయి. ప్రజా ప్రతినిధుల మాట చెల్లుబాటు కాకపోతే రాజకీయం చేయలేమన్న ప్రజాప్రతినిధుల గగ్గొలుతో అర్హుల ఎంపికలో ప్రజాప్రతినిధులకు మొదట్లో ఇవ్వని ప్రాధాన్యత ప్రస్తుతం పెరిగింది. ఇందుకు గల కారణాలు అన్ని రాజకీయ కోణంలోనే ఉన్నాయని స్పష్టమవుతోంది.
తాజాగా దివ్యాంగుల వాహనాలు
ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పరిధిలో ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వం వాహనాలను సమరకూర్చింది. ఇందుకు దరఖాస్తులను పెట్టుకున్నారు. అయితే తక్కువ వాహనాలు రావడంతో అధికారులపై ఒత్తిడి పెరిగింది. నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేల నుండి సిఫార్సులు పెరిగాయి. దీంతో అర్హత కలిగిన వారి పరిస్థితి మారిపోయింది.
ఎంపికలో ఉండాల్సిన వారికంటే సిఫార్సుల ద్వారా వచ్చిన వారికే అవకాశం ఉందన్న వాదన పెరగడంతో నిజమైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ పరిధిలోని ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి 70 వాహనాలు అందుబాటులో ఉంచారు. ఒకొక్క వాహనానికి రూ.95 వేలు వెచ్చించింది ప్రభుత్వం. అంటే ఒక్కొ నియోజకవర్గానికి 10 వాహనాలు ఇవ్వాలి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో లబ్ధిదారుల ఎంపిక గందరగోళంగా మారింది.
ఇటీవల కాకినాడలో ఇందుకు సంబంధించి దరఖాస్తుల పరిశీలనకూడా జరిగింది. ఎంపికలో సగం మంది మహిళా దివ్యాంగులు ఉండాలి. ఈ అర్హతల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో పొలిటికల్ ప్రెజర్ పెరగడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.కొన్ని నియోజకవర్గాల్లో దివ్యాంగులకు వాహనాలు ఇప్పిస్తామని వాహనాల ధరలో సగం డబ్బులు మధ్యవర్తులు తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఇంకెన్ని ఆరోపణలు వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే అధికారులు మాత్రం తమ ఎంపిక పారదర్శకంగా ఉంటుందని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News, Schemes, Ysrcp