P Ramesh, News18, Kakinada
సాధారణంగా క్రైమ్ చాలా రకాలుగా చేస్తుంటారు నేరస్తులు . ఎక్కువగా ప్రధాన పట్టణాలే టార్గెట్ వారికి. అయితే ఈ ఏడాది ఎక్కువగా చిన్న చిన్న పట్టణాలు, పల్లెలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. తూర్పు గోదావరి జిల్లాలో (East Godavari District) ఇటీవల సులువుగా నగదును కాజేయాలన్న ఉద్దేశ్యంలో దొంగలు చేస్తున్న ఎత్తుగడకు పోలీసులు సైతం షాక్ తింటున్నారు. ఈనేపథ్యంలో ముగ్గురు దొంగలు చేసిన పని చూస్తే అంతా షాక్ తిన్నారు. ఎంత సులువుగా నగదు కొట్టేసారో తెలుసుకున్న పోలీసులు నిఘా పెట్టి వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ATM సెంటర్ల వద్ద వృద్ధులను మోసం చేసీ డబ్బులు కాజేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలియని వారిని ఏమార్చి.. ఏటీఎం కార్డులు కాజేసి, వేరే కార్డులు మార్చి ఇచ్చి, మోసంతో డబ్బులు డ్రా చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుండి రూ. 1,40,200/- రూపాయలు స్వాధీనం, ఒక మోటార్ సైకిల్, పాత ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. ఏటీఎం ల వద్ద కాపు కాసి డబ్బులు డ్రాచేసిన విషయాన్ని తెలుసుకుని వారికి సహకరిస్తున్నట్టు నటించి పిన్ తెలుకుని, మరోక నకిలీ ఎటీఎం కార్డును ఇచ్చి సులువుగా నగదు కాజేయడం అలవాటుగా నేర్చుకున్నారు.
కేటుగాళ్ల లెక్క ఇలా..
గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన కడారి నాగరాజు పిఠాపురం మెయిన్ బ్రాంచ్ SBI బ్యాంక్ దగ్గర ఉన్న ATM సెంటర్ కువెళ్లి, నగదు తీయడం తెలియక చూస్తుండగా, అప్పటికే అక్కడ ఉన్న గుర్తుతెలియని వ్యక్తి నాగరాజుకు సహకరించే ప్రయత్నంలో పిన్ తెలుసుకుని, రూ.2 వేలు డ్రా చేసి ఇచ్చాడు. ఈసమయంలో తీసుకున్న ఒరిజనల్ ఏటీఎం కార్డు స్థానంలో నకిలీ ఏటీఎం కార్డు ఇచ్చాడు. ఆతర్వాత నాగరాజు కార్డు నుండి రూ.28 వేలు డ్రా చేశాడు.
ఇదే తరహాలో మడబోయిన సుబ్బారావు కార్డు నుండి రూ.1,05,000 వేల నగదు, అమలదాసు అప్పారావు అనే వ్యక్తి కార్డు నుండి రూ.56,600 నగదును, శాంతకుమారి అనే మహిళ నుండి రూ.17,500 నగదను డ్రా చేశాడు. ఇలా పలు ఏటీఎం ల వద్ద ఇదే తరహా మోసాలకు పాల్పడటంతో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై నిఘా ఉంచిన పోలీసులు సీసీ కెమెరాలు, నేరాలు జరిగిన పరిసర ప్రాంతాలను పరిశీలించి నిందితులను గుర్తించారు.
జగ్గంపేట మండలం ఇరుపాక గ్రామానికి చెందిన ఎల్. ఉమా శ్రీనివాస్, జి.దుర్గా ప్రసాద్‌లతోపాటు, ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన ఎమ్.బాబీని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎటీఎం ల వద్ద నకిలీ కార్డులు మార్చి మోసాలను పాల్పడినట్టు నిందితులు అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఇలాంటి మోసపూరిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.