P Ramesh, News18, Kakinada
సాధారణంగా పోలీసులంటే నెగిటివ్ భావనే ఉంటుంది చాలా వరకూ. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మా జీతాలు మాకివ్వాలని, ఉద్యోగ విధుల్లో నిబంధనలు తొలగించాలన్న డిమాండ్లతో రోడ్డెక్కిన అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా (Kakinada District) లో ఏకంగా పోలీస్ స్టేషన్‌లో అర్థరాత్రంతా ఉంచారు. అయితే పోలీసులు తీసుకున్న కఠిన నిర్ణయం అందరికీ కఠువుగా అనిపించోచ్చు. కానీ కాకినాడ జిల్లా పిఠాపురంలో పోలీసులు చేసిన ఆపనికి అంగన్‌వాడీలే ఫిదా అవుతున్నారు.
అంగన్‌వాడీలు తలపెట్టిన చలో విజయవాడకు పోలీసులు అడ్డగించడంతో కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైల్వేస్టేషన్‌లో ఉన్నవారిని విజయవాడ వెళ్లనివ్వకుండా అడ్డుకుని , పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రాత్రంతా నిర్భందించారు. దీంతో అంగన్‌వాడీలు రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమకు జీతాలు ఇవ్వకుండా, సమస్యలు పరిష్కరించని ముఖ్యమంత్రి ఎందుకని ప్రశ్నించిన అంగన్ వాడీలు తక్షణం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు అరెస్టు అయ్యారని సమాచారం తెలుసుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉదయాన్నే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి అంగన్‌వాడీల నిరసనకు మద్ధతు తెలిపారు. అరెస్టు చేసిన అంగన్‌వాడీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు.
అయితే విజయవాడ వెళ్లే రైళ్లన్ని వెళ్లే వరకూ విడుదల చేసేది లేదని చెప్పడంతో వర్మ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆయన అక్కడే నినాదాలు చేశారు. అంగన్‌వాడీలను విడుదల చేసే వరకూ పోలీస్ స్టేషన్ వద్దే ఉంటామన్నారు. చివరకు పోలీసులు కూడా తమ పై అధికారుల నుండి ఆదేశాలు వచ్చే వరకూ వదిలేదిలేదని తేల్చి చెప్పడంతో అక్కడే నిరసన కొనసాగించారు.
రాత్రంతా స్టేషన్‌లో ఉన్న వారికి సపర్యలు
రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉన్న అంగన్ వాడీలకు పోలీసులు సపర్యలు చేశారు. రాత్రి సమయంలో అరెస్టు చేసినప్పటికీ వారికి టీ, టీఫిన్, భోజన సౌకర్యం కల్పించారు. ఆహార పొట్లాలను తెప్పించి వారికి అందించారు. స్టేషన్‌లోనే మరుగు సౌకర్యం కల్పించారు. ఎవరైనా దీర్ఘకాలిక రోగులుంటే ముందే చెప్పాలని వారికి మందులు కూడా ఇస్తామని పిఠాపురం సిఐ వై.ఆర్.కే శ్రీనివాస్ చెప్పారు. అయితే పోలీసులు అరెస్టు చేసి రాత్రంతా స్టేషన్‌లో ఉంచితే సాధారణంగా నెగిటివ్ భావన రావాలి. కానీ అంగన్‌వాడీలు పైకి వారి కర్తవ్య పరంగా వారిని విజయవాడ వెళ్లకుండా ఆపినప్పటికీ, మానవత్వంతో రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో సౌకర్యాలు కల్పించడం చూస్తే పోలీసులు మంచోళ్లనే భావన కలిగిందని కొందరు అంగన్‌వాడీలు చెప్పుకొచ్చారు. మొత్తం మీద అంగన్‌వాడీల పోరాటం పోలీసులకు మంచి చేసిందని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Local News