P Ramesh, News18, Kakinada
శ్రీరామనవమి (Srirama Navami) వచ్చిందంటే చాలు గ్రామాల్లో ఒకటే సందడి.. గ్రామాలలో రామాలయల వద్ద తెల్లవారు జామున నుండి పండగ వాతావరణం ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానమాచరించి రామాలయాలకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నాం జరిగే శ్రీరాముల వారి వివాహం చూసి, పానకం, వడపప్పు ప్రసాదం తీసుకుని వస్తుంటారు. శ్రీరామ నవమి రోజున విసినగర్రలు కూడా పంచిపెట్టడం చూస్తుంటాం. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో భక్తులు సాంప్రదాయాలను కొనసాగిస్తూ నేటికి పాత తరం జ్క్షాపకాలను గుర్తు చేస్తున్నారు. అలాంటి వారిలో కోనసీమ వాసులు పెట్టింది పేరు. సాధారణంగా ఇక్కడ వివాహాలు జరిగితే ఆ తర్వాత జరిగే తంతులు మాములుగా ఉండవు.
ఆడపిల్లకు సారె పెట్టే విషయంలో ఎక్కడా తగ్గరు. గత కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంత వాసులు టన్నుల కొద్ది సారె పెట్టిన రోజులు ఉన్నాయి. అయితే ఇక్కడ కేవలం మనుషులకే సారె పెడతారంటే కాదండి. దేవుళ్లకు సారె సమర్పణ ఉంటుంది. అందులో సీతాదేవికి సమర్పించే సారె విషయంలో ఎక్కడా తగ్గేదెలే అంటున్నారు కోనసీమ వాసులు. శ్రీరామనవమికి ఇక్కడ క్షత్రియులు సీతమ్మకు సారె సమర్పిస్తున్న విధానం ఆకట్టుకుంటోంది.
వైనతేయ నదీ తీరాన ఉన్న పట్టాభిరామ స్వామి ఆలయం శ్రీరామ నవమి రోజున ప్రత్యేకతను సంతరించుకుంది. త్రేతాయుగంలో క్షత్రియ వంశీయుల ఆచార సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. సుమారు 14 సంవత్సరాల కాలం నుండి పేరిచర్ల రామరాజు సత్యవాణి దంపతులు శ్రీరామ నవమి రోజున రాముల వారి తరపున సీతమ్మ తల్లికి కంత సారె సమర్పిస్తారు.
భద్రాచలంలో మాదిరిగా ఇక్కడ నిర్మించిన పర్ణశాల చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది నవమి 15 రోజుల ముందుగా 108 కేజీల పాలకోవ తో వివిధ రకాల ఫలాకృతులు, బొమ్మలు, అమ్మవారి చీర, స్వామి వారికి పట్టు పంచె తయారుచేస్తారు. స్వామివారి కల్యాణం తో పాటు ఈ కంత సారె ను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కల్యాణం అనంతరం స్వామి వారి తీర్ధ ప్రసాదాలతో పాటు కంత సారెను భక్తులకుపంచిపెడతారు.
పిండివంటలు చేసి, పర్ణశాల తయారు చేసి అలంకరిస్తారు. అన్ని రకలా వంటలతోపాటు, కూరగాయలు కూడా సారె రూపంలో ఇస్తారు. పెళ్లి అయిన తర్వాత సారె ఎలా ఉంటుందో అదే స్థాయిలో సీతాదేవికి సారె సమర్పణ చేస్తారు. ఈ సారె తయారీకి పరిసర ప్రాంత భక్తులు పాల్గొంటారు. మొత్తం అన్ని వంటలు తయారు చేసి వాటిని పాత్రలలో పెట్టి శ్రీరామనవమి రోజున శ్రీరాముడి వివాహం జరిగిన వెంటనే సారెను అక్కడ పెళ్లి పీటలపై సమర్పిస్తారు. రాములు వారి వీటిని చూసి సంతోషిస్తారనేది ఇక్కడ భక్తుల నమ్మకం. అనంతరం ఈ పిండి పదార్థాలను భక్తులకు పంచి పెడతారు. పెద్ద ఎత్తున్న ఇవి తయారు చేయడానికి శ్రమ పడ్డ భక్తులు ఆఖరి రోజు సారె సమర్పణలో పాల్గొని తన్మయత్వం పొందుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Local News, Sri Rama Navami 2023