AP Schools: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) విద్యా రంగంపై ప్రత్యేక ఫోకస్ చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ పఠశాలలకు సంబంధించి అనేక మార్పులు చేస్తున్నారు. నాడు నేడు (Nadu Nedu) పేరుతో ఇప్పటికే రూపు రేఖలు కూడా మార్చారు. సంస్కరణల పేరుతో చాలా వరకు మంచి ఫలితాలు వచ్చినా.. కొన్ని చేదు ఫలితాలు కూడా ఇస్తున్నాయి. సంస్కరణల సంగతి ఎలా ఉన్నా..? నూతన జాతీయ విద్యా విధానం పేరుతో రాష్ట్రంలో తరగతుల విలీనం మాత్రం ప్రభుత్వ పాఠశాలల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తోంది. అందుకే 3, 4, 5 తరగతుల విలీనం నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం ఆపాలని ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనూతన జాతీయ విద్యా విధానాన్ని దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడంలేదని, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రధాని మోదీ (Prime Minister Modi) కి వంత పాడుతూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేయడంపై పలు సంఘాలు మండిపడుతున్నాయి. అలాగే నాడు-నేడు, అమ్మఒడి (Ammavadi), జగనన్న విద్యాదీవెన (Jagananna Vidya Deevena) అమలు చేస్తున్నామంటూ ఓ వైపు గొప్పులు చెబుతూ మరోవైపు ప్రభుత్వ పాఠశాలలను కుదించడం సరైంది కాదని సూచిస్తున్నారు.
ఇప్పటికే విలీనం కారణంగా అనేక పాఠశాలలు మూతపడుతూ వేలాది ఉపాధ్యాయ పోస్టులు నిర్వీర్యం అవుతాయన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విలీనం నిర్ణయాన్ని ఉప సంహరించుకొని జీఓ 117ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. పాఠశాలల విలీనం ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అన్నదానికి తాజా నిదర్శనం ఒకటి ఏపీ దర్శనమిచ్చింది.
ప్రస్తుతం విలీనంతో కొన్ని బడుల్లో ఇద్దరు ముగ్గురు విద్యార్థులే మిగిలారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాపేశ్వరం లాకుల దగ్గర ఉన్న మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలోనే అదే దుస్థితి నెలకొంది. ఈ విద్యాసంవత్సరం ఇక్కడ ముగ్గురు విద్యార్థులే మిగిలారు. గతేడాది వరకు ఒకటి నుంచి 5 తరగతులు ఉన్న ఈ బడిలో 20 మంది చదువుకునే వారు. విలీనంలో భాగంగా 3, 4, 5 తరగతులకు చెందిన 17 మంది విద్యార్థులను సమీప పాఠశాలలో చేర్చారు. ఇప్పుడు ఒకటో తరగతి విద్యార్థి, రెండో తరగతి పిల్లలు ఇద్దరు మిగిలారు. బడిలో ఒక ఉపాధ్యాయుడు, మధ్యాహ్న భోజనం వండేందుకు ఒక ఆయా ఉన్నారు.
ఇదీ చదవండి : విజయసాయికి బండ్ల ఆఫర్.. మంచి రాజకీయ నాయకుడిగా తీర్చి దిద్దుతా అంటూ సూచన
అయితే ఇలాంటి స్కూళ్లు ఎంకా ఎన్నో ఉన్నాయని.. ఇప్పటికైనా ప్రభుత్వం.. అధికారులు కళ్లు తెరవాలి అన్నారు. లేదంటే ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని వివిధ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. సంస్కరణలు చేపట్టడం తప్పు కాదని.. కానీ ఇలా ప్రభుత్వ పఠశాలలపై ప్రభావం చూపించే జాతీయ విధానాలకు మాత్రం స్వస్థి చెప్పాలనే డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, East godavari