(Ramesh, News18, East Godavari)
భారతదేశం(India) వివిధ సంస్కృతులకు, సాంప్రదాయాలకు ప్రతీక. ప్రతీ రాష్ట్రంలో ఆయా ప్రాంతాల ఆచారా వ్యవహారాలకు తగ్గట్టుగా పండుగలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా అటువంటి పండుగల్లో ఒకటి హోలి(Holi).ఇది దేశ వ్యాప్తంగా జరుపుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇదే రోజున డూడ్ పండగ (Dud Festival)నిర్వహిస్తారు. ఇది తెలుగు వారికి కొత్త అవ్వొచ్చు. కానీ రాజస్థానీయులకు ఇదొక శుభదినం.
ప్రత్యేకమైన ఆచారం..
హోలీరోజున ఉదయాన్నే రంగులు పూసుకుని సందడి చేసే వారంతా రోజంతా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా అన్ని రంగుల సముదాయంతో సంస్కృతి నెలవై జరిగే హోలీరోజున అత్యంత విశిష్టమైన ఆచారం డూడ్. ముఖ్యంగా రాజస్థానీయులలో శేఠ్ ల కుటుంబాల్లో అతి విశిష్టమైన డూడ్ పండగ రోజు ఆ కుటుంబాల్లో తొలి సంతానానికి సత్కారం చేస్తారు. తొలి సంతానంలో ఏడాదిలోపు చిన్నారులను అందంగా అలంకరించి, ముస్తాబు చేస్తారు.
హోలీ రోజున తొలి సంతానానికి సత్కారం..
మేడలో దండ వేసి, కాటుక పెట్టి, తిలకం దిద్ద చూడముచ్చటగా పెళ్లి కొడుకులా చేస్తారు. అనంతరం తలపై బియ్యం చల్లుతారు. దుప్పటి కప్పి, కర్రలతో కొడుతూ పాటలు పాడతారు. ఇదంతా చూడటానికి చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ పిల్లల కోసం జరిగే పండగగా డూడ్‌కు పేరుంది. తమ సాంప్రదాయాలు తెలిపేందుకు, దేవుడి చల్లని దీవెనలు కలగాలంటే డూడ్ ముఖ్యమంటున్నారు రాజస్థానీయులు. తెలుగు రాష్ట్రాల్లో స్థిర పడ్డ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన హిందూ వర్గీయులంతా హోలీలో భాగంగా డూడ్‌ను నిర్వహిస్తారు.
డూడ్ పండుగ..
డూడ్ పండగ అనంతరం స్వీట్లు పంచుతారు. వచ్చిన అతిథులకు మర్యాదలు చేస్తారు. మార్వాడీల కుటుంబాల్లో ఈ పండుగకు అత్యంత ప్రాధాన్యత కల్పించడబడింది. ఎక్కడో దూర ప్రాంతాల నుండి తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది మర్వాడీలు పూర్వం నుండి ఇక్కడే ఉండిపోయారు. అయినప్పటికీ వారి పూర్వీకుల ద్వారా వచ్చే ఆచార వ్యవహారాలను నిర్వర్తించడంలో వారికి సాటి లేరు. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవి పూజతోపాటు, మర్వాడీలు చేస్తే కళా ప్రదర్శనలకు ఎంతో పేరుంది.
సాంప్రదాయం ..
వీటన్నింటిలో హోలీరోజున నిర్వర్తించే డూడ్ మాత్రం సాంప్రదాయ బద్దంగా ప్రతీ ఇంటిలో జరిగే పండగట. హోలీకి ముందు జన్మించి ఏడాది నుండి రెండేళ్లలోపు చిన్నారులు సత్కారం చేయడం వీరి ఆచారం. ఇంటికి తొలి సంతానం ఎవరైనా డూడ్ వేడుక నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఇదే రోజు వారి కుటుంబం మొత్తం విందు భోజనాలు కూడా పెట్టుకుంటారు. చిన్నపిల్లలు ఆరోగ్యంగా, క్రమశిక్షణగా ఎంతో సామాజిక సంబంధాలు కలిగి, సంస్కృతికి దగ్గరవ్వాలనే ఒక కారణంతో ఈ పండుగ తమ పూర్వీకుల కాలం నుండి వస్తుందని అంటున్నారు మార్వాడీ పెద్దలు. మొత్తం మీద హోలీరోజున డూడ్ ఓ ప్రత్యేక పండగ కావడంతో దీనిని చూసేందుకు ఇతర వర్గాలకు చెందిన వారు ఆసక్తి కనబరుస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, East Godavari Dist, Holi 2023, Local News