P Ramesh, News18, Kakinada
ప్రభుత్వాలు ఏమున్నా వాటికి అనుకూలంగా ప్రచారం చేసుకోవడంలో ఎవ్వరూ తగ్గడం లేదు. గతంలో తెలుగుదేశం (Telugu Desham) ప్రచార ఆర్భాటాలతో చాలా తప్పులు చేసింది. అయితే మేం తక్కువా అన్నట్టుగా ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ (YSRCP) గతంలో టిడిపి చేసిన తప్పులనే చేసి విమర్శలపాలవుతోంది. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. జిల్లా పరిషత్ సమావేశంలో భాగంగా ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రస్తుతం కాకినాడ, కోనసీమ జిల్లాతోపాటు, రాజమండ్రి పరిధిలోకి వచ్చే దాదాపుగా 480 ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటిరియల్ అందించే ప్రక్రియను మొదలుపెట్టారు. జిల్లా పరిషత్ సమావేశం సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కోనసీమ కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎంపీ వంగా గీత, జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారుల సమక్షంలో స్టడీ మెటిరియల్ ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇందుకోసం రూ.1.20 కోట్లు ఖర్చు చేసింది జిల్లా పరిషత్. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా ఈ స్టడీ మెటిరియల్‌పై ఉన్న చిత్రాలు చూసి అంతా షాక్ అయ్యారు. వాస్తవానికి ఈ పుస్తకాలు వైసీపీ కరపత్రాలుగా ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ పథకాల ప్రచారం, నవరత్నాల లోగోతోపాటు, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల ఫోటోలు ఉండటం చూసి అంతా షాక్ అయ్యారు. వాస్తవానికి స్టడీ మెటిరియల్ అంటే కేవలం చదువుకు సంబంధించి, విజ్క్షానానికి సంబంధించిన మెటిరియల్‌ను అందులో ఉంచాలి.
అయితే తమ వైసీపీ ప్రభుత్వం గొప్పతనం, పథకాలు, ఎంత ఖర్చు చేసిందో తెలిపే వివరాలు ఉండటం విమర్శలకు తావిస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి విద్యాపరంగా విద్యార్థులకు విద్య సంబంధిత అంశాలు మాత్రమే తెలియజేయాలి. అందులో 10వ తరగతి విద్యార్థులంటే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ పూర్తి వైసీపీ రంగులతో కూడిన పుస్తకాలు అందించారన్న విమర్శలు మూటకట్టుకున్నారు జిల్లా పరిషత్ పాలకులు.
ఇదేనా జగనన్న విద్యా భారతి
ఈపుస్తకాల పంపిణీకి జగనన్న విద్యా భారతి అనే నామకరణం కూడా చేశారు. సొంతంగా ఈ కార్యక్రమానికి పేరు పెట్టారా..లేదా ప్రభుత్వమే సూచించిందా అనేది మాత్రం తెలియడం లేదు. తెలుగు, ఇంగ్లీషు మీడియం పుస్తకాలను అందిస్తున్నారు. ఈపుస్తకానికి కేవలం జగన్, భారతి పేరు కలిసేలా జిల్లా పరిషత్ స్వామి భక్తి చూపించుకున్నట్లుందని అంటున్నారు. మొత్తం ప్రభుత్వ పథకాలు ప్రచారానికి ఇంతలా ఖర్చు చేసి, దానికి విద్యార్థులకు స్టడీ మెటిరియల్ అని పేరు పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జిల్లా పరిషత్ పుస్తకాల పంపిణీలో ప్రచారం వివాదస్పదంగా మారడం కాకినాడ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.