Ramesh, News18, Kakinada
నువ్వు వెళ్లు నాకు ఊరిలో పని ఉంది. నేను పనిపూర్తయిన తర్వాత వస్తా అని భార్యకు భరోసా ఇచ్చాడు. భర్త మాట విని భార్య ఊరు వెళ్లిపోయింది. ఆమె వెళ్లి రోజులు గడుస్తున్నా భర్త రాలేదు. ఫోన్ లేదు, ఎక్కడున్నాడో తెలియలేదు. కనీసం జాడ కూడా లేకుండా మాయమయ్యాడు. ఇది జరిగి 3 నెలలు గడుస్తోంది. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఫలితం లేదు. ఏం చేయాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించింది. సీన్ కట్ చేస్తే.. సెప్టిక్ ట్యాంకు నుండి ఓ ఆస్థి పంజరం బయటకొచ్చింది. కుంచే అప్పన్న(48), సత్యవతి భార్యభర్తలిద్దరూ విజయవాడ (Vijayawada) లోని ఓ అపార్టుమెంట్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. సొంతూరు తూర్పు గోదావరి (East Godavari District) లోని జగ్గంపేట మండల మల్లిసాల. అక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి మల్లిసాలో కొండపోడు భూమి ఉంది. వివాదంలో ఉన్న ఆ భూమి విషయమై జూన్ 5న ఆ దంపతులిద్దరు విజయవాడ నుండి మల్లిసాల వచ్చారు. తీరా చూస్తే అక్కడ భూమి గొడవ పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో అప్పన్న తన భార్యను విజయవాడ వెళ్లమని, తాను రెండు రోజుల్లో వచ్చేస్తా అని చెప్పాడు. అప్పన్న భార్య సత్యవతి భర్త మాట విని విజయవాడ వెళ్లిపోయింది. వారం గడిచినా అప్పన్న విజయవాడ రాకపోవడంతో సత్యవతి బంధువులను వాకాబు చేసింది. కానీ అప్పన్న కనిపించలేదనే సమాధానం దొరికింది.
ఎంత ఆరా తీసినా ఆచూకి తెలియకపోవడంతో విజయవాడ నుండి మళ్లీ మల్లిసాలకు చేరుకున్న సత్యవతి తన భర్త కనిపించడంలేదని సెప్టెంబర్ 7వ తేదిన జగ్గంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మల్లిసాలలో తన ఇంటి వద్ద దిగాలుగా ఉండిపోయిన ఆమెకు ఇంటి నుండి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి ఇంటి చుట్టూ వెతికింది.
ఇంటి వెనుక ఉన్న సెప్టింక్ ట్యాంకు మూత పగిలి ఉండటం, అక్కడే అప్పన్న చొక్కా ఉండటంతో వెంటనే చుట్టు పక్కల వారిని పిలిచింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సెప్టిక్ ట్యాంకు నుండి కుళ్లిన మృతదేహాన్ని తీశారు. మొత్తం ఆస్తిపంజరం మాత్రమే మిగిలి ఉండటంతో వైద్యుని పిలిపించి అక్కడే పోస్టు మార్టం నివేదిక సిద్ధం చేయించారు పోలీసులు.
డెత్ మిస్టరీపై పోలీసులు ఆరా..!
కుంచే అప్పన్నను ఎవరు అంతమొందించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానస్పదమృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు… 3 నెలల క్రితం ఆయన ఎవరితో గొడవ పడ్డారు. కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. హత్య చేసి ఇక్కడకు తెచ్చిపడేశారా లేక మద్యం మత్తులో సెప్టింక్ ట్యాంకులో పడిపోయాడా అసలేం జరిగిందనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే వాస్తవాలు బయటకొస్తాయని జగ్గంపేట సిఐ సూర్య అప్పారావు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.