P Ramesh, News18, Kakinada
సీజన్ మొదలైంది. అవును ప్రతీ దానికి ఒక సీజన్ ఉంటుంది. అలాగే మట్టి మాఫియాకు సమ్మర్ సీజన్ (Summer Season) అనేది చాలా మందికి తెలీదు. ప్రస్తుతం రాష్ట్రంలో మైనింగ్, మట్టిమాఫియాకు తిరుగులేదు. అధికార బలంతో ఎక్కడికక్కడ అడ్డొచ్చిన వారిపై దాడులు జరుగుతున్నాయి. అడిగే నాథుడు లేడు. పోలీసు కేసు నమోదు చేసినా సరియైన న్యాయం జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) లోని కొత్తపేట, రావులపాలెంలో జరుగుతున్న మట్టి మాఫియాలను అడ్డుకోవడానికి ఎవరూ సాహసించడం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత కొద్ది రోజులుగా మట్టి మాఫియా గొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో రావులపాలెం మండలం కొమరాజులంకలో రైతుపై మట్టి మాఫియా దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మట్టి తవ్వుకుపోవడాన్ని వ్యతిరేఖిస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా మాజీ ఉపసర్పంచి కుమారుడు గుర్రాల నాగమేల్లేశ్వరరావుపై దాడికి పాల్పడటంతో అతడు కొత్తపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొంత కాలంగా భూముల్లో మట్టిని ఇష్టానుసారగంగా తవ్వుకుపోవడంతో అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జీవి సత్యనారాయణ అనే వ్యక్తి లంక సొసైటీ భూముల్లో విలువైన మట్టి తవ్వుకుపోతున్నారని హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడి నుండి మొదలైన యుద్దం రాజకీయంగా మారిపోయింది. గ్రామంలో మాజీ ఉపసర్పంచి, ప్రస్తుత సర్పించి వర్గీయులు యుద్దానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఉండగా సర్పంచి వర్గీయులు మాజీ ఉపసర్పంచి కుమారుడిని కొట్టారని కేసు నమోదైయింది. మొత్తం మీద మట్టి మాఫియా ప్రభావం మాత్రం అధికార-ప్రతిపక్ష పార్టీలకు యుద్ధాన్ని తెచ్చిందనే చెప్పాలి.
మట్టితో ఏం చేస్తారు..
సాధారణంగా వేసవిలో మట్టిని తవ్వుకునే వెసులు బాటు ఉంటుంది. మిగత కాలంలో పంటలు ఉంటాయి. కానీ వేసవిలో నేల మొత్తం ఆరిపోయి ఉండటం వల్ల మట్టి తవ్వుకునే అవకాశం ఉంటుంది. ఈ మట్టిని ఖాళీ స్థలాల చదునుకు ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలలో ఇటుక బట్టి పరిశ్రమకు వాడతారు. తద్వారా భారీ ఎత్తున సంపాదనకు మట్టి అవకాశం కల్పిస్తుంది. వాస్తవానికి మైనింగ్ శాఖ అనుమతి లేనిదే మట్టి తవ్వకూడదు.
కానీ ఎటువంటి అనుమతులు లేకుండా రాజకీయ ప్రాబల్యంతో మట్టి తవ్వుకుపోవడం ఇక్కడ తూర్పుగోదావరి రాజకీయ నాయకులకు పెట్టింది పేరు. అడ్డొచ్చిన వారిపై దాడులు, బెదిరింపులతో ప్రతీయేటా మట్టి మాఫియా జరుగుతుంది. దీనిపై కేసులు నమోదవుతున్న మార్పు మాత్రం రావడం లేదు. అయితే ఇలా తవ్వుకుంటూ పోతే పంటలు పండే ఆస్కారం పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.