P Ramesh, News18, Kakinada
ప్రస్తుతం జరుగుతున్న క్రైమ్ తీరు చూస్తుంటే ఏం నేరాలు రా నాయనా..! అన్నట్టుగా ఉంది పరిస్థితి. నేరాలు తీరు చూస్తుంటే హడలిపోతున్నారు. సాయంత్రం వరకూ సరదా గడిపిన వారు తెల్లారేసరికి శవాలవుతున్నారు. వారి స్వయంకృతమా లేక హత్యోదంతమో అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) లో జరుగుతున్న నేరాలు పోలీసులను సైతం భయపెడుతున్నాయి. ఒక పక్క పోలీసులు క్రైమ్ రేటు తగ్గించాలని చూస్తున్న ప్రతిసారి దాని వేగం పెరుగుతుంది. ముఖ్యంగా యువత పెడదోవపడుతుంది. గంజాయి అలవాట్లు, దోపిడి ఇలా చూస్తే నేరాలకు వ్యసనాలే కారణంగా చెబుతున్నారు మానసిక నిపుణులు. ప్రతీచోట ఏదోక నేరంతో పోలీసులు సతమతమవుతూనే ఉన్నారు. కోనసీమ జిల్లాలో కూడా నేరాలు పెరుగుతున్నాయి.
పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నప్పటికీ మరోపక్క నేరప్రవృతి గల యువకులు రెచ్చిపోతున్నారు. ఇందులో మానసిక సంఘర్షణలతో ఆత్మహత్యలు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కొన్నింటిలో ఆత్మహత్య రూపంలో హత్యలు ఉంటున్నాయి. ఇందుకు ఎక్కువగా అసాంఘిక కార్యక్రమాలు, వివాహేతర సంబంధాలు వంటివి ఎక్కువగా కారణాలు చెప్పవచ్చు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) లో పోలవరం పోలవరం మండలం పాత ఇంజరం గ్రామానికి చెందిన గ్రామంలో రొయ్యల చెరువు కాశి శ్రీనివాస్ (32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు రెండు సంవత్సరాలుగా కొమరగిరి లో ఆక్వా చెరువు వద్ద పనిచేస్తున్నాడు. ఆ చెరువు పక్కన ఉన్న పాకలో ఉరి వేసుకున్నట్టు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరాతీసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వివాహితుడైన శ్రీనివాస్ ఒంటరిగా ఆ పాకలో ఉంటున్నాడు.
మృతుడు భార్య కూడా కుటుంబానికి ఆర్థిక చేయూత కోసం ఏడాది క్రితం విదేశానికి వెళ్లింది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. భార్యతో ఏమైనా గొడవలు జరుగుతున్నాయా, లేక రోయ్యల చెరువు వద్ద వివాదమా అనే కోణంలో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. కష్టపడి జీవించే కాశి శ్రీనివాస్ ప్రాణాలు తీసుకునేంత పిరికివాడు కాదని అంటున్నారు. అయితే అతడు చనిపోవడానికి కారణాలపై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వస్తాయని చెబుతున్నారు పోలీసులు. మొత్తం మీద ఆక్వా చెరువు వద్ద శ్రీనివాస్ మృతి చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.