(Ramesh, News18, East Godavari)
ఆరుగాలాలు పంట పండించాలంటే మొదట కావాల్సింది నీరు. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల్లో నీటికి ఢోకాలేదు. పుష్కలంగా నీరుంది. గతంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లో నీరుంది. దీంతోపాటు ఎక్కడికక్కడ బోరులు ఉన్నాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో గోదావరి జలాల వల్ల నీటి ఇబ్బంది లేకపోవడంతో గతంలో ఖరీఫ్‌ను గట్టెక్కించారు. ప్రస్తుతం రబీకి సిద్ధమవుతున్నారు.
అయితే అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది కోనసీమ జిల్లాలోని కొంత మంది రైతుల పరిస్థితి.ప్రస్తుతం అక్కడ ప్రాంతంలో నీరున్నా పొలాలకు అందడం లేదు. ఇందుకు గల కారణాలపై మాత్రం రైతులు తీవ్ర వ్యతిరేఖత కనబరుస్తున్నారు. సకాలంలో జరగాల్సిన పనులు జరగకపోవడంతో నీటి తీరువా విధానం అమలు కాక అవస్థలు పడుతున్నారు. పల్లానికి పారాల్సిన నీరు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన కౌలు రైతు సాధనాల కృష్ణమూర్తి 15 ఎకరాలు కౌలుకి తీసుకున్నాడు. అతడు వరి నాట్లు వేయడానికి సిద్ధపడ్డాడు. కానీ సాగునీరు రాలేదు. తీరా పై పొలాలకు అందుతుంది. ముఖ్యం కారణం పంట కాలువలు సక్రమంగా లేకపోవడం నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
నారుమళ్లు వేసినప్పటికీ, వాటికి ఎరువులు పెట్టినప్పటికీ నీరు అందలేకపోవడంతో పంట భూమి ఎండిపోయింది. బీటలు వారిన పొలంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పటికే అప్పు చేసి కౌలు భూమిచేస్తున్నాడు. తొలుత నారుమళ్లకు పెట్టుబడి పెట్టేశాడు. ఇప్పుడేమో నీరు రాకపోవడంతో పొలం ఎండిపోతుంది. అక్కడ పరిసర ప్రాంతంలో రైతులందరిదీ దాదాపుగా ఇదే పరిస్థితి.
సాగునీరు సకాలంలో విడుదల చేయాలి. కాల్వలు ఆధునీకరించాలి. ఈరెండు పనులు సకాలంలో జరగకపోవడంతోనే ఇబ్బంది ఏర్పడిందంటున్నాడు. గత కొద్ది రోజుల క్రితం వరకూ ధాన్యం అమ్మడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఖరీఫ్‌లో పండిన ధాన్యం అమ్మడానికి తిప్పలు తప్పలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మాయిచ్ఛర్ పేరుతో ఆటంకాలు ఏర్పడ్డాయి.
తేమశాతం ఎక్కువ ఉందన్న కారణంతో ధర పలకలేదు. దీంతో మరలా ధాన్యాన్ని ఎండలో ఆరబోసి, వాటిని బస్తాలలో వేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు పంపించారు. ఇలా చేయడానికైన ఖర్చు తో పోలిస్తే లాభం మాట పక్కన పెడితే పెట్టుబడులు కూడా రాలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మిన ధాన్యానికి డబ్బులు కూడా ఇంకా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ప్రభుత్వం నుండి వచ్చే ఆటంకాలు తట్టుకోలేక మిల్లర్లకు అమ్మేశారు.
ఇన్ని బాధలు మొన్నటి వరకూ పడ్డ రైతులకు ప్రస్తుతం చాలా చోట్ల నీటి కష్టాలు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. గ్రామపెద్దలు , నీటి తీరువా సరి చేసే వారు నీటి కోసం రైతుల నుండి సొమ్ములు కూడా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాకినాడ జిల్లాలో ఈ తరహా సంస్కృతి కొన్ని మండలాల్లో కొనసాగుతుంది. లేదంటే శివారు ప్రాంతాలకు నీరు సక్రమంగా అందదు. ప్రభుత్వం నిజాయితీ అన్ని పనులు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇంకా క్షేత్ర స్థాయిలో నీటి రాజకీయాలు ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News