P. Ramesh, News 18 Telugu.
కార్తీక మాసం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం. తెల్లవారు జామునే పుణ్యస్నానాలతో మొదలైన ఈ నెలంతా దీపారాధనలతో కాంతులీనుతోంది. ఇక ఉసిరి చెట్టు కింద భోజనం, పేదలకు సహాయ కార్యక్రమాలు, విందులు, అన్ని వర్గాల సమాహారం కలిపి వన భోజనాల వేదికే ఓ మహత్తర ఘట్టమైంది.
తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా ఉన్న భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు హిందూ సంస్కృతికి అద్దంలా ఉన్నాయి. అందులో తెలుగు రాష్ట్రాల పద్ధతులే వేరు. విదేశీయుల సైతం మనల్ని ఎంతగానో మెచ్చుకుంటారు. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన గౌరవం దక్కే జిల్లా తూర్పు గోదావరి. ఉమ్మడి తూర్పుగోదావరి అనగానే కాకినాడ, కోనసీమ జిల్లాలు రెండు ఇందులో ఉన్నాయి. ఇక ఏజెన్సీ జిల్లాలు కూడా ఉమ్మడి తూర్పులో భాగమే.
ఈ ఏడాది ఇక్కడ జరిగిన కార్తీక సందడి అంతా ఇంత కాదు. నెల రోజుల పాటు ఆనందానికి అవధుల్లేవు. చిన్న పిల్లల దగ్గర నుండి యువత, మహిళలు, పెద్దలు వరకూ సందడి చేశారు. కార్తీక మాసం వేదికలుగా మారిన మారేడుమిల్లి, పాపికొండలు, కాకినాడ బీచ్, గోదావరి నదీ తీరం, యానాం ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సహజ అందాలకు అవదుల్లేవనేది తేట తెల్లమవుతుంది. దివ్యక్షేత్రాలకు పుట్టినిల్లుగా ఉన్న తూర్పు గోదావరిలో పలు క్షేత్రాలు అంటే..అన్నవరం, ద్రాక్షారామం, పిఠాపురం, సామర్లకోట, రాజమహేంద్రవరం, అంతర్వేదిలతోపాటు ఎన్నో క్షేత్రాలకు ఈ ఏడాది భక్తులు పోటెత్తారు. అక్కడ దర్శనం అనంతరం తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ వంటకాలను ఆరగించి, తెలుగు సంస్కృతిని కాపాడటంలో మన వాళ్లంతా ఇమిడిపోయారు.
పుష్కలమైన భోజనం..
ఈ సారి జరిగిన వన భోజనాల్లో పుష్కలమైన భోజనం లభించింది. కంద బచ్చలికి పెట్టింది పేరు కార్తీక మాసం వన భోజనం. చాలా చోట్ల బూరె, పరమాన్నం, దద్దోజనం, పులిహోర, నోరూరించే సాంబారు, అప్పడం, కొన్ని చోట్ల ఆవకాయ, దోసకాయల పచ్చడి, కమ్మని పెరుగుతోపాటు, పలు రకాల పొడులతో వన భోజనాలు అదరగొట్టేశారు. ఇక స్వాములకు ప్రత్యేకం. అరటి ఆకులు వేడి వేడి అన్నం పెట్టుకుని, ముద్ద పప్పు ఆవకాయ పచ్చడి వేసుకుని తిని ఎన్నోరుచులను ఆస్వాదించారు.
కాకినాడ , ఉప్పాడ, అంతర్వేది, మరో వైపు గోదావరి అందాలు, పాపికొండలు, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో తెగ గడిపేశారు. కొంత మంది ఈసారి కుల భోజనాలకు ప్రాధాన్యత తగ్గించి, సహపంక్తులకు ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని కార్మిక సంఘాలు, యూనియన్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రైవేటు వర్కర్లు ఇలా సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చి మరికొంత మంది కార్తీక మాసాన్ని ఆస్వాదించారు.
రాజకీయ నేతలకు వేదికలు
ఇక వన భోజనాలు కొంత మంది రాజకీయ నేతలు వేదికలుగా మార్చుకున్నారు. అన్ని వర్గాల వారు ఒకే చోటకు రావడంతో కలిసొచ్చిన అంశంగా పరిగణించారు. అందుకే కొన్ని చోట్ల ఊదరగొట్టే ప్రసంగాలతో కాస్తా బోరునపించినా, యువత సందడితో, చిన్నపిల్లల ఆట పాటలతో అంతా హడావుడి సాగింది. ఈసారి వన సమారాధన. మొత్తం మీద అన్ని వర్గాల వారు, పొలాల్లో గడిపిన మధురానుభూతులను స్మరించుకున్నారు. ఈ ఏడాది జరిగిన వన సమారాధనలలో వృద్ధులు కూడా ఎక్కువగా సందడి చేశారంటే కార్తీకమాసం అందరికి పెద్ద పండగనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Karthika deepam, Local News