P Ramesh, News18, Kakinada
భారతదేశం (India) హిందూ సాంప్రదాయాలకు (Hindu Traditions) పుట్టినిల్లు. దేవుళ్లతోపాటు ముక్కోటి దేవతల ఆశీసులు ఉండాలంటారు. చరిత్రలోకి వెళితే ప్రజల్ని రాక్షస పాలన నుండి రక్షించేందుకు దేవుళ్లకు సమాచారమిచ్చి గ్రామాలను రక్షించే దేవతలే నేడు మనకు గ్రామ దేవతలుగా నిలిచారు. ప్రతీయేటా ఉత్సవం చేస్తూ అమ్మవార్లని కొలుస్తుంటాం. ముఖ్యంగా కొత్త అమవాస్య అంటే ఆడపడచుకి పెద్ద పండగ. అందుకే ఇంటి ఆడపడచుకి ఎంత గౌరవం ఇచ్చుకుంటామో గ్రామ దేవతకు అంతకంటే ఎక్కువ గౌరవం ఇచ్చి పండగ చేస్తాం. కొత్త అమవాస్యకు అంతటి పేరుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavri District) లో ఉన్న గ్రామాలలో జరిగే దేవతల పండగలకు ఒక్కొక్క పండగకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అందుకే దేవతలకు నైవేద్యాలు పెట్టి మరీ పూజిస్తారు. ఆయా గ్రామంలో వచ్చే సాంప్రదాయం ఆధారంగా సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు సాగిపోతుంటారు గ్రామాల ప్రజలు.
ముఖ్యంగా కాకినాడ జిల్లా (Kakinada District) లోని పెద్దాపురం మండలం కాండ్రకోట అమ్మవారి ఉత్సవం విశిష్టత తెలుసకుంటే నిజంగా అమ్మ వరం పొందినంత ఆనందం కలుగుతుంది. కాండ్రకోట దేవాలయంలో భారీ విగ్రహ రూపంలో అమ్మవారు కొలువై ఉన్నారు. దేవాదాయశాఖ పరిధిలోనికి వచ్చే ఈ ఆలయంలో ఏడాదిలో పెద్ద ఉత్సవం కొత్త అమవాస్య రోజునే జరుగుతుంది. అందుకే కాండ్రకోట జాతర అంటే నూకాలమ్మ జాతరకు పెట్టింది పేరుగా చెబుతారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మదర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలను అమ్మ పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందుతారు.
అమ్మలగన్న అమ్మగా కొలువైన కాండ్రకోట నూకాలమ్మ ఆలయాన్ని చూస్తే ఆ అనుభూతే వేరు. ముఖ్యంగా కొత్త అమవాస్య రెండు రోజుల పాటు ఇక్కడ జరిగే ఉత్సవం తిలకించేందుకు పరిసర గ్రామాలతోపాటు, జిల్లాలోని ముఖ్య పట్టణ వాసులు కూడా జాతరకు వస్తారు. నిజంగా ఇక్కడ జరిగే జాతర చూసేందుకు రెండు కళ్లు చాలవు. అనంతరం నూకాలమ్మ దర్శనం చేసుకుంటారు.ఉగాది ముందు రోజున జరిగే కాండ్రకోట నూకాలమ్మ జాతరకు నూతన దంపతులు, నిరుద్యోగులు, ఆరోగ్యం బాగుండాలని కోరుకునే వారు, ఇలా ప్రతీ విషయంలో తమకు జయం కలగాలని, మంచి జరగాలని నూకాలమ్మకు మొక్కులు మొక్కేందుకు, మొక్కిన మొక్కులు తీర్చేందుకు వస్తుంటారు.
కాకినాడ జిల్లా పెద్దాపురానికి 10 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. కాకినాడ నుండి, అన్నవరం నుండి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. దూర ప్రాంతాల నుండి వచ్చే వారు సామర్లకోట రైల్వేస్టేషన్ వరకూ రైలులో కూడా రావచ్చు. అక్కడ నుండి పెద్దాపురం 5 కిలోమీటర్లు, అక్కడ నుండి కాండ్రకోట 10 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఆలయంలో ఉన్న నూకాలమ్మ తల్లి విగ్రహం పెరిగిందని ప్రచారం ఉండేది. అయితే భారీ విగ్రహం కావడంతో అలా అనిపించి ఉండొచ్చనేది కొందరి వాదన. ఏదేమైనా మహిమగల శక్తి ఈ ఆలయం ఉందని భక్తులు విశ్వసిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.