P Ramesh, News18, Kakinada
రైతులేనిది మనంలేం కాని, దాదాపుగా దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం రైతులపైనే ఆధారపడుతుందని చెప్పడానికి ఎన్నో కారణాలున్నాయి. అందుకే రైతు దేశానికి వెన్నెముక అంటారు. ప్రభుత్వం ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలుగాని, పథకాలు గాని రైతులకే ఇస్తుంది. ఇందుకు కారణం రైతు పండిన పంట, దాని అమ్మకం తదితర అంశాలపై ఎన్నో వ్యాపారాలు ఆధారపడతాయి. ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఏలా మేలు చేయాలి. వారికి ఎలాంటి పథకాలు అందివ్వాలన్న అంశాలపై తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా (Kakinada District) లో రైతులకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు, వారికి వాణిజ్యపరమైన అవకాశాలు కల్పించేందుకు ప్రతీ బుధ, గురు వారాల్లో రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బికే)లలో సిబ్బంది తప్పనిసరిగా ఉండాల్సిందేనని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా సూచించారు.
కాకినాడ జేసీ ఇలక్కియ అధ్యక్షతన 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించి జిల్లా సలహా కమిటీ (డీసీసీ), జిల్లాస్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్‌సీ) సమావేశాలు జరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బ్యాంకర్లకు జాయింట్ కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రుణాలు మంజూరు, కౌలు రైతులకు రుణాలు, విద్యా రుణాలు, ఏపీ టిడ్కో రుణాలు తదితరాలపై సమావేశంలో చర్చించారు.
వారే లక్ష్యం..పథకాలే సాక్ష్యం
రైతులు, కౌలు రైతులతో పాటు పశు సంవర్ధక, మత్స్యరంగ రైతుల సంక్షేమం కోసం వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్న నేపథ్యంలో వారికి బ్యాంక్ సేవలపై అవగాహన పెంపొందించించి, అవి చేరువయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఆర్థిక సమ్మిళిత (ఎఫ్ఐ) శిబిరాల్లో స్వీకరించిన ముఖ్యంగా కేసీసీ (పశుసంవర్థక, మత్స్య), టిడ్కో, విద్య తదితర రుణాలకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 27,505 మంది కౌలు రైతులకు రూ. 28.06 కోట్ల మేర రుణాలు మంజూరైనట్లు తెలిపారు. ఇదే విధంగా పశు సంవర్ధక, మత్స్య రంగ రైతులకు రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని సూచించారు. ఏపీ టిడ్కోకు సంబంధించి 5,064 మందికి రుణాలు మంజూరు లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 3,386 మందికి రుణాలు మంజూరయ్యాయని , మిగిలిన దరఖాస్తులను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు.
జగనన్న తోడు ఆరో విడతకు సంబంధించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల లబ్ధిదారుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. బ్యాంకులు తప్పనిసరిగా ఆర్థిక అక్షరాస్యత, సమ్మిళిత శిబిరాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఉపాధి సృష్టి కార్యక్రమం (పీఎంఈజీపీ), స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన, పీఎం స్వానిధి, నాబార్డు పథకాలు, మెప్డా కార్యకలాపాలు తదితరాలపైనా సమావేశంలో చర్చించారు. జిల్లా లీడ్ బ్యాంకు కన్వీనర్ కేఎన్‌వీ చిన్నారావు, ఎల్‌డీవో పీపీ పూర్ణిమ, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్, ఎల్‌డీఎం సీహెచ్ఎస్‌వీ ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, మెప్మా పీడీ బి.ప్రియంవద, వ్యవసాయ శాఖ అధికారి ఎన్.విజయ్‌కుమార్, ఉద్యాన అధికారి బీవీ రమణ, పశు సంవర్థక శాఖ అధికారి డా. సూర్యప్రకాష్, వివిధ బ్యాంకుల అధికారులు జేసీ సమావేశానికి హాజరై రైతు పథకాలపై చర్చించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Local News