(Ramesh,News18,East Godavari)
గృహ నిర్మాణాల లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా హౌసింగ్ డే(Housing Day)ను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. 2019లో ఏపీ(AP)లో వైసీపీ(YCP)ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 30 లక్షల ఇళ్ల నిర్మాణం టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే కరోనా ప్రభావంతో పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఆ తర్వాత ఇళ్ల స్థలాల కొనుగోలులో వేగం పెంచింది. అక్కడ నుండి వరుసగా ఇళ్ల స్థలాల కేటాయింపుపై సమీక్షలు చేస్తూనే ఉన్న ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు కేటాయించింది.
ఇళ్ల స్తలాల అవకతవకలు..
ఆ తర్వాత మండల ప్రత్యేక అధికారులతో కూడిన బృందంలోని అధికారులు అంతా ఆయా మండలాలలోని లేఅవుట్లను సందర్శించి గృహ నిర్మాణ పనులను సమీక్షించడం జరుగుతుంది. కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇటీవల కాలంలో స్థలాల్లో ఏర్పడ్డ సమస్యలపై చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం, కొమరిగిరిలో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి కాకినాడ అర్బన్ లబ్ధిదారులకు కేటాయించిన కొమరగిరి లేఅవుట్‌ను, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నేమం గ్రామంలో ఉన్న 3, 4 లేఔట్లో జరుగుతున్న గృహ నిర్మాణ పనులను జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా.. రెవెన్యూ, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇళ్ళ స్థలాల సమస్యపై పలు సూచనలు చేశారు.
జాప్యంపై కలెక్టర్ ప్రత్యేక ఆరా ..
నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం ద్వారా జిల్లాలో చేపట్టిన గృహ నిర్మాణాలు గత నాలుగైదు నెలలుగా వర్షాలు కారణంగా మందకొడిగా సాగడం, లే- ఔట్ సక్రమంగా చేయకపోవడం తదితర అంశాలపై దృష్టి సారించారు. ఈ ప్రభావం జిల్లాలో రెండు వారాలుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గృహ నిర్మాణాలు వేగం పుంజుకోవడం ఇక్కడ కలిసొచ్చిన అంశం.జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించే దిశగా ప్రతి శనివారం హౌసింగ్ డే ను నిర్వహించడం ప్రారంభించిన కలెక్టర్ఈ కార్యక్రమం ద్వారా మండల ప్రత్యేక అధికారితో కూడిన ప్రత్యేక బృందం మండలాల పరిధిలో ఉన్న హౌసింగ్ కాలనీలతో పాటు లేఔట్ లో జరుగుతున్న పనులు సమీక్షించడం జరుగుతుందని స్పష్టం చేశారు కలెక్టర్ కృత్తికా శుక్లా.
సూచనలు చేసిన మేడమ్..
ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో పెద్ద లే అవుట్లయిన కొమరగిరి, నేమం గ్రామంలో ఉన్న 3, 4 లేఔట్లను జగనన్న కాలనీలను అధికారులతో కలిసి ఆమె పరిశీలించి పలు సూచనలు చేశారు. కొమరగిరి లేఔట్ కు సంబంధించి 13 వేల గృహాలు మంజూరు కాగా అయిదుగురు గుత్తేదారులతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇక్కడ నిర్మాణ పనులకు అవసరమైన ఆర్.ఎం.సి. ప్లాంట్, బ్రిక్స్ ప్లాంట్‌తో పాటు రూ.25 లక్షలతో పైపులైన్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపిన కలెక్టర్ రానున్న మూడు నెలల్లో కొమరగిరి లేఔట్ కు సంబంధించి సుమారుగా ఐదు వేల ఇళ్ళు గృహప్రవేశాలకు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు.
త్వరగా పూర్తి చేయాలని ఆదేశం..
నేమం గ్రామంలో ఉన్న లేఔట్-4 కు సంబంధించి 1,100 గృహాలు మంజూరు కాగా ఇటీవలే ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో రెండు బ్రిడ్జి నిర్మాణ పనులు ఇతర కల్వర్టు పనులు చేపట్టడం జరిగింది. ఈ పనులను త్వరితగతిన పూర్తిచేసుకుని నెల రోజులలో గ్రౌండింగ్ పనులు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. నేమం లేఔట్-3కి సంబంధించి 1,700 గృహాలు మంజూరు కాగా, ఇప్పటికే 330 గృహాలు పూర్తిచేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి లేఔట్లో గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, ఐరన్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. వచ్చే నాలుగైదు నెలలు వాతావరణం నిర్మాణ పనులకు అనుకూలంగా ఉండటంతో గృహ నిర్మాణాలను వేగవంతం చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ చెప్పడం అధికారులు ఉరుకులు.. పరుగులు తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Kakinada, Local News