P Ramesh, News18, Kakinada
పేదోడి పనంటే చాలు సక్కబెట్టే నాయకులకంటే.. నొక్కేసే నాయకులే ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం కలియుగం అన్నందుకల్లా సాయం చేయమని అడిగితే మొత్తం నాకించేసే నాయకులే ఎక్కువయ్యారు. ప్రజాప్రతినిధి అంటే ప్రజల కోసం పాటు పడే రోజులు కావివి. ఓట్లు కొన్నామా.. ఎన్నికల్లో నెగ్గామా.. కూడబెట్టుకున్నామా ఇదే తంతు సాగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు, ప్రజలకు సేవ చేయడమే మన కర్తవ్యం అనేది కేవలం ప్రతిజ్ఞ వరకూ మాత్రమే ఉందని చెప్పాలి. కొందరైతే పెద్దల పేర్లు చెప్పి స్కామ్ లు చేయడంలో రాటు దేలిపోయారు. ఎక్కడచూసినా మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి కోవలోనే ఇటీవల ఉమ్మడి తూర్పు గోదావరి (East Godavari District) లో ఓ మోసం వెలుగులోకి వచ్చింది.
కొద్ది రోజుల క్రితం ఓ రైతు కాకినాడ జిల్లా (Kakinada District) కలెక్టర్ కృతికాశుక్లాను కలిసారు. తమ గ్రామానికి చెందిన కొంత మంది దళిత రైతుల భూమిని ప్రభుత్వం ఏపీఐఐసీ, కెఎస్‌యిజెడ్ అవసరాల నిమిత్తం తీసుకుందని అయితే తమకు రావాల్సిన పరిహారం విషయంలో రైతులు మోసపోయారని వాపోయాడు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం, బ్యాంకు సిబ్బంది ద్వారా తమ వద్ద ముందుగానే సంతకాలతో తీసుకున్న ఖాళీ చెక్కుల ద్వారా ఒక్కొక్కరి ఖాతా నుండి రూ.3 లక్షల వరకూ నగదు కాజేసినట్టు కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ పెద్దాపురం ఆర్డీవోను వివరణ కోరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలు సూత్రదారులెవరనేది దానిపై మాత్రం నిజాలు చెప్పేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఒక్కొక్క దళిత రైతు దగ్గర కాజేసిన సొమ్ము తిరిగి ఇవ్వాలా,సాకులు చూపాలా అన్నట్టుగా పరిస్థితి మారింది. అయితే ఈమొత్తం వ్యవహారం వెనుక ఓ వైకాపా నేత హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారం కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడ గ్రామం కేంద్రంగా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. కోదాడ గ్రామ సర్పంచి భర్త బూర్తి నాని అనే అసామి తమ వద్ద ఖాళీ చెక్కులు తీసుకున్నారని, ఆయనే పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సిబ్బందితో కుమ్మకై రూ.3 లక్షలు చొప్పన తమకు వచ్చిన భూపరిహారంలో నగదు కాజేసారని రైతు నొక్కు సూర్యనారాయణ రాతపూర్వకంగా కలెక్టర్‌కుఫిర్యాదు చేశారు.
అయితే ఇలా ఫిర్యాదు చేసారన్న కారణంతో సూర్యనారాయణ ఇంటిపై కొందరు దాడి చేసినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి దళిత రైతులను నమ్మించి, అదే దళిత వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇలా మోసం చేయడం తొండంగి మండలంలో పెద్ద రచ్చగా మారింది. కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నారని, సాయం చేస్తే నిందలు వేయడం తగదంటుని సంబంధిత నిందిత వ్యక్తి చెబుతున్నారు. ప్రస్తుతం ఈమొత్తం వ్యవహారం వైసీపీ మెడకు చుట్టుకుంటుంది. పరిహారం పంపిణీలో న్యాయం చేయాల్సిన వైసీపీ నాయకులు ముందు కొంత మందిని బూచిగా చూపి వెనుక నొక్కేస్తున్నారన్న ఆరోపణలు మండలమంతా వ్యాపించాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు కాకినాడ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Local News