P. Ramesh, News18, Kakinada
ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే అది స్నేహమొక్కటే.. అలాంటి స్నేహ బంధం విలువ తెలిసిన ఆ స్నేహితులంతా చనిపోయిన తమ స్నేహితుడి కోసం ఏం చేశారో తెలియాలంటే ఒక్కసారి మనం తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) సామర్లకోట వెళ్లాల్సిందే..! చిన్ననాటి స్నేహితులంటే ఆ అనుబంధమే వేరు. చెట్టా పట్టాలు లేసుకోని ఆడుకోవడం, చదువుకోవడం, పండగలకు కలుసుకుని సందడి చేయడం… ఇలాంటి జ్ఞాపకాలెన్నో వాళ్ల మదిలో జీవితాంతం ఉండిపోతాయి. జీవితంలో స్థిరపడినప్పటికీ చిన్ననాటి స్నేహితులను మరచిపోవడమంటే అది సాధ్యం కాదు. ఎక్కడో ఒక చోట ఆ అనుబంధం ఉంటుంది. అలాంటి అనుబంధాన్ని తెగతెంపులు చేసుకున్న అతడు ఈ లోకాన్ని విడిచాడు. సామర్లకోట పట్టణంలో నివాసముండేటువంటి యరమాటి ప్రతాప్ చౌదరి అవివాహితుడు.
సామర్లకోటలో చాలా కాలం పాటు ఉన్న అతడు వ్యాపారం నిమిత్తం హైదరబాద్ (Hyderabad) వెళ్లాడు. కొద్ది రోజులు అక్కడే ఉంటూ వ్యాపారం చేస్తుండేవాడు. వీలున్నప్పుడల్లా సామర్లకోట వచ్చేవాడు. వచ్చిన ప్రతీ సారి స్నేహితులను కలవందే తిరిగి హైదరాబాద్ వెళ్లేవాడు కాదు. స్నేహితుంటే ప్రాణంగా ఉండే ప్రతాప్ చౌదరి తన స్నేహితులకు ఏం కష్టం వచ్చినా వదిలేవాడు కాదు. అందరూ కలిస్తే అదో పెద్ద పండగగా గడిపేవాడు.
ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం హార్ట్ ఎటాక్‌తో ప్రతాప్ చౌదరి ఆకస్మికంగా మృతిచెందాడు. ఈ విషయాన్ని తెలిసి స్నేహితులు కుంగిపోయారు. నిత్యం తమతో టచ్‌లో ఉండే ప్రతాప్ చౌదరి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. నెలలు గడిచిపోయాయి. కాని అతడి స్నేహం మాత్రం వాళ్ల మదిలోనే ఉంది. ఇంతలో చనిపోయిన ప్రతాప్ చౌదరి పుట్టినరోజు రానే వచ్చింది. ఇంకే ముంది అతడి కోసం ఏదైనా చేయాలని తోటి స్నేహితులు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అతడి జన్మదినాన్ని పురస్కరించుకుని 4 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఓ పండగను తలపించేలా సామర్లకోటలో అందరికి పసందైన విందు చేశారు.
ఈ సందర్బంగా వారంతా తీర్మానించుకున్నారు. రానున్న కాలంలో ప్రతీయేటా ప్రతాప్ చౌదరి జయంతి వేడుక రోజున ఏదొక కార్యక్రమం చేపట్టాలని. పేదలకు సేవా కార్యక్రమాలతో పాటు, ప్రతాప్ చౌదరికి గుర్తుగా ఉండేటువంటి పనులకు శ్రీకారం చుట్టాలని, అందులో భాగంగా ఈ ఏడాది భోజనాలు పెట్టి, వచ్చే ఏడాది నుండి అవకాశాన్ని బట్టి ఏదొక సేవా కార్యక్రమం చేయడానికి స్నేహితులంతా నిర్ణయించడంతో స్నేహమంటే ఇదేరా అనేలా అనిపించారని సామర్లకోట వాసులు ఈ స్నేహబంధాన్ని కొనియాడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Friendship, Local News