P Ramesh, News18, Kakinada
వారిద్దరూ కలెక్టర్లు.. పైగా దంపతులు. పక్క పక్క జిల్లాలో పనిచేస్తూ నిత్యం బిజీగా ఉంటారు. ఉదయం లేస్తే ప్రజా సమస్యలు. పరిష్కారాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పనిచేయడం వారి విధి. మార్నింగ్ నుండి వీడియో కాన్ఫెరెన్స్ లు ప్రభుత్వ పథకాల అమలు ఇలా చెబుతూ పోతే కలెక్టర్ అంటే మాములు విషయం కాదనేది అందరికీ తెలిసింది. అలాంటి కలెక్టర్లు ఒక్కసారిగా వారి వేషధారణలు మార్చి భక్తులుగా మారిపోతే ఏలా ఉంటుంది. సరిగ్గా కాకినాడ జిల్లా (Kakinada District) లో అదే జరిగింది. శ్రీరామ నవమి వేడుక (Sri Rama Navami) ను పురస్కరించుకుని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఆమె భర్త అయినటువంటి కోనసీమ కలెక్టర్ హిమాన్షు శుక్లా గొల్లమామిడాడను దర్శించుకున్నారు. అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ల దంపతులిద్దరూ వారి వేషధారణ ఆకట్టుకుంది. కోనసీమ జిల్లా (Konaseema District) కలెక్టర్ హిమాన్షు శుక్లా తలపాగ కట్టి కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. ఇక కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా అయితే తలపై పళ్లెం పట్టుకుని భర్తతో పాటు అడుగులు వేసి సీతారాములకి సాంప్రదాయ బద్దంగా పట్టువస్త్రాలు సమర్పించారు. రోజంతా గొల్లల మామిడాడ ఆలయంలో గడిపారు కలెక్టర్ దంపతులు. ఇద్దరు కలెక్టర్లు గొల్లల మామిడాడ గ్రామంలో గడపంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. నిత్యం బిజీగా ఉండే కలెక్టర్లు భక్తులుగా మారిపోవడంతోపాటు, కుటుంబ సభ్యులతో ఆలయంలో గడపడంతో అంతా ఆసక్తిగా తిలకించారు. వీరితోపాటు పలు శాఖల అధికారులు కూడా ఉన్నారు. వీరు కూడా కలెక్టర్ల దంపతుల పుణ్యమా అని సీతారాముల కళ్యాణ వేడుకను తిలకించారు.
కలెక్టర్ల దంపతులు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ శోభకృత్ నామసంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
శ్రీరామ నవమి సందర్భంగా చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న జి.మామిడాడ కోదండరామ స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సంవత్సరం అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని శాసనసభ్యులు ఆకాంక్షించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.