(Ramesh, News18, East Godavari)
కాలం మారిపోయింది. క్రైమ్ రేటు పెరిగిపోతుంది. ఎవరిని ఎవరు నమ్మాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దొంగలు వారి వేషాలను మార్చుకుంటున్నారు. తెలిసిన వారిగానే నటిస్తున్నారు. మాటల్లో మాటలు కలుపుతున్నారు. పొరపాటున ఏమరపాటుగా ఉంటేమెుత్తం దోపిడీ చేసేస్తారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదే తరహా ఘటనలతో జనం హడలిపోతున్నారు. తెల్లారితే చాలు ఎక్కడి నుండి ఏలాంటి వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన మొదలైంది. పక్కనే ఉంటూ తెలిసిన వారిలా నటిస్తున్న కేడిల మోసాలు పెరిగిపోతుంటే ఎవ్వరికీ చెప్పుకోవాలో.. ఏం చేయాలో కూడా తెలియడం లేదు. మోసం జరిగిపోయాక లబోదిబోమనడం తప్పితే ఏం చేయలేని దుస్థితిలో బాధితులు పెరిగిపోతున్నారు.
ఇటీవల కాలంలో కాకినాడ జిల్లా పిఠాపురంలో పట్టపగలు దోపిడి దొంగలు భీభత్సం సృష్టించారు. దంపతుల ముసుగులో వచ్చిన వీరు, పిఠాపురంలోని సీతయ్యగారితోటలో కొత్తపల్లి సూర్య ప్రభావతి అనే వృద్దురాలి వద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నారు. తమది ఏలూరు దగ్గర ఒక ఊరని చెప్పి తాపీ పనిచేసుకుంటూ జీవిస్తున్నామని నమ్మబలికారు. తాము ఇక్కడ ప్రాంతానికి వచ్చామని, ఊరు నుండి సామాగ్రి తెచ్చుకుంటామని చెప్పి వెళ్లిపోయారు.
తిరిగి 15 రోజుల తర్వాత వచ్చిన ఆ దంపతులు సామాన్లు సర్థుకున్నట్లుగా నటించారు. ఇదే సమయంలో తాము తీసుకున్న పోర్షన్‌కు నీళ్లు రావడం లేదని, పైపు పాడైందని ఒక్కసారి చూడంటూ ఓనర్ అయినటువంటి సూర్యప్రభావతిని వారు దిగిన పోర్షన్‌లోకి పిలిచారు. ఆమె వారి వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా సమయంలో వృద్దురాలి వద్ద ఎవరూ లేని సమయం చూసి మాటలో మాట కలిపారు. ఏకాంతంగా ఆమె ఉండటాన్ని గమనించారు. అప్పటికే వారి వద్ద ఉన్న ప్లాస్టర్ ను సూర్యప్రభావతి మూతికి చుట్టేసారు. చేతులు వెనక్కి మడిచి ఆమెపై దాడి చేశారు. తాళ్ళతో కట్టి పిడుగు గుద్దులు గుద్దారు. ఆమె వద్ద ఉన్న గాజులు, తాడు, చెవిలీలు దోపిడీ చేశారు. ఆమె ఉంటున్న పక్క పోర్షన్‌లోకి వెళ్లి సెల్‌ఫోన్‌తోపాటు, మొత్తంగా 200 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కొద్దిసేపటికి తేరుకున్న ఆమె తాళ్లను విప్పుకుని పక్కంటివారికి విషయాన్ని తెలిపింది. ఇరుగు పొరుగు వారి సహకారంతో పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదొ కొత్త తరహా నేరాలు
దొంగలు ఎంత సులువుగా దొంగతనాలకు పాల్పడుతున్నారనే దానికి ఇదొక ఉదాహరణగా చెబుతున్నారు
పోలీసులు. ఇల్లు అద్దెకు ఇవ్వాలనుకున్నవారు క్షుణ్ణంగా వారి వివరాలు తెలుసుకుని మాత్రమే ఇవ్వాలని చెబుతున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో జరిగిన నేరం కూడా దాదాపుగా ఇదే కోవలోకి వస్తుంది. టూలెట్ బోర్డు చూసి, వృద్ధురాలైన ఓనర్ తీరును గమనించారు. ఆమె కోడలు, కొడుకు ఉద్యోగాలకు వెళ్లిపోవడం, ఆమె ఒకరే ఒంటరిగా ఉండటాన్ని గమనించారు.
దంపతులు కావడంతో ఆమె వారిని నమ్మింది. భార్య భర్తలుగా చెలామణి అవుతూ దొంగతనాలకు పాల్పడుతున్న వారిపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెబుతున్నారు. అద్దెకు ఇచ్చే వారు మాత్రం ఖచ్చితంగా ఇంటి కోసం వస్తున్నవారి వివరాలు, ఆధార్ కార్డు పరిశీలించి మాత్రమే పరిగణలోకి తీసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News